మల్లన్నసాగర్ ప్రాజెక్టుని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముంపు గ్రామాల రైతులు ధర్నాలు చేస్తున్నారు. వారికి ప్రొఫెసర్ కోదండరాం, జస్టిస్ చంద్రకుమార్ వంటి పెద్దలు సంఘీభావం తెలుపుతున్నారు. నిర్వాసితులపై పోలీసులు నిన్న లాఠీ చార్జ్ చేసినందుకు నిరసనగా సోమవారం మెదక్ జిల్లా బంద్ పాటిస్తున్నారు.
మరోపక్క ముంపు ప్రాంతాలలో ఒకటైన ఏటిగడ్డ కిష్టాపూర్ వద్దనే తెరాస ప్రభుత్వం రిజిస్టార్ కౌంటర్ ఏర్పాటు చేసి అక్కడే భూముల రిజిస్ట్రేషన్లు జరిపించేస్తోంది. మొత్తం 8 ముంపు గ్రామాలలో ఇప్పటికే 5 గ్రామాలలో రిజిస్ట్రేషన్లు పూర్తయిపోయాయని మంత్రి హరీష్ రావు స్వయంగా తెలిపారు. ఏటిగడ్డలో ఆందోళన చేస్తున్న వారికి కూడా మంత్రి స్వయంగా నచ్చజెప్పడంతో ఆ గ్రామంలో కూడా సుమారు 1,000 ఎకరాలు భూసేకరణ ప్రక్రియని పూర్తిచేశామని మంత్రి చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ప్రతిపక్షాలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం అమాయకులైన రైతులని రెచ్చగొట్టి, శాంతిభద్రతల సమస్యని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. భూసేకరణ అనేది ప్రభుత్వానికి, గ్రామస్తులకి మధ్య జరిగే వ్యవహారం. కనుక దానిని రైతులతో మాట్లాడి పరిష్కరించుకోవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ మధ్యలో ప్రతిపక్షాలు అందులో ఎందుకు తల దూరుస్తున్నాయని హరీష్ రావు ప్రశ్నించారు. రైతులకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగానే నష్టపరిహారం చెల్లిస్తామని, భూసేకరణకి సహకరించిన రైతులకి ఎలాంటి నష్టం కలుగకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని” హరీష్ రావు హామీ ఇచ్చారు.
ఒకవేళ నీటిపారుదల శాఖ మంత్రి ఈ భూసేకరణ ప్రక్రియని సజావుగా పూర్తి చేయగలిగితే, అప్పుడు ఇక ప్రతిపక్షాలు చేయగలిగిందేమీ ఉండదు. ఇన్ని రోజులుగా వారు చేస్తున్న పోరాటాలు మల్లన్నసాగర్ లో కనబడకుండా కొట్టుకు పోతాయి. ఇన్ని సమస్యలు, ప్రతిపక్షాల సవాళ్ళని ఎదుర్కొని మరీ ఈ భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసినందుకు హరీష్ రావుకి అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో కూడా ప్రతిష్ట మరింత పెరగవచ్చు.
ఆయనపై నమ్మకంతో భూములు ఇచ్చినందుకు రైతుల బాగోగులు చూసుకోవలసిన బాధ్యత హరీష్ రావుదే అవుతుంది కనుక ప్రభుత్వం తరపున నిర్వాసితులకి ఇచ్చిన అన్ని హామీలని ఆయన నిలబెట్టుకోవలసి ఉంటుంది. అప్పుడే ఆయన పట్ల నిర్వాసితులలో కూడా నమ్మకం, గౌరవం కలుగుతుంది. లేకుంటే మళ్ళీ ప్రతిపక్షాలకి అవకాశం ఇచ్చినట్లే అవుతుంది. హామీలని నిలబెట్టుకోలేకపోతే, అప్పుడు ప్రభుత్వం గురించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు నిజమని నమ్మవలసి వస్తుంది.