తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్ళయినా ఇంతవరకు హైకోర్టు విభజన చేయని కారణంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఉద్యమిస్తున్నారు. ఆ కారణంగా న్యాయవ్యవస్థ స్తంభించిపోయింది. అందరికీ న్యాయం చెప్పే న్యాయమూర్తులు కూడా చివరికి రోడ్డున పడి, సస్పెండ్ అయ్యారు. ఇటువంటి దుస్థితి మరే రాష్ట్రంలోను కనబడదు. భారత్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ మాటని మన్నించి న్యాయవాదులు అందరూ మళ్ళీ తమ విధులలో చేరారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఈ పరిస్థితి తీవ్రత గురించి వివరించి తక్షణమే ఈ సమస్య పరిష్కారం కోసం తగిన చర్యలు చేపట్టవలసిందిగా కోరారు. కనీసం అప్పుడైనా ఈ సమస్య పునరావృతం కాకుండా జాగ్రత్తపడవలసిన కేంద్ర ప్రభుత్వం దాని కోసం ఏమి చేస్తోందో తెలియదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్దిష్టమైన సానుకూల సంకేతాలు రాకపోవడంతో, తీవ్ర అసంతృప్తి చెందిన తెలంగాణలో అన్ని జిల్లాల న్యాయవాదులు హైకోర్టు విభజన కోరుతూ సోమవారం డిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. వారితో తెరాస ఎంపిలు కూడా పాల్గొన్నారు.
ఒక నిర్దిష్ట వ్యవధిలో చట్టప్రకారం జరిగిపోవలసిన హైకోర్టు విభజన ప్రక్రియ కోసం న్యాయవాదులు, న్యాయమూర్తులు, ఎంపిలు రోడ్లెక్కవలసి రావడం చాలా దురదృష్టం. ఒక మనిషిలో ఆరోగ్య సమస్య ఉన్నట్లు గుర్తించినప్పుడు సకాలంలో వైద్యం చేయకపోతే చివరికి అది ఏ విధంగా తీవ్ర పరిణామాలకి దారి తీస్తుందో, అదే విధంగా వ్యవస్థలో సమస్యలని గుర్తించిన తరువాత కూడా వాటిని సకాలంలో పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తే అటువంటి విపరీత పరిణామాలే ఉత్పన్నం అవుతాయి. తెలంగాణ ఉద్యమాలు, వాటి పరిణామాలు అన్నీ మన కళ్ళ ముందు ఇంకా సజీవంగా కదలాడుతూనే ఉన్నాయి. గతంలో రాష్ట్ర విభజన సమస్యని కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు నానబెట్టినందుకు అనేక మంది యువకులు బలిదానాలు చేసుకొన్నారు. రాష్ట్రానికి, దేశానికి వేల కోట్ల ఆర్ధిక నష్టం జరిగింది. అన్నదమ్ములలాగా కలిసి మెలిసి జీవించిన ఆంధ్రా, తెలంగాణ ప్రజల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. అప్పుడు యూపియే ప్రభుత్వం చేసిన తప్పునే మళ్ళీ ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం కూడా చేస్తున్నట్లుంది.
హైకోర్టు విభజన కూడా అటువంటి సమస్యే. దానిని పరిష్కరించకపోవడం వలన ఏమయిందో ఇంతవరకు అందరూ చూశారు. ఇంకా నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందో ఎవరూ ఊహించలేరు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం కంటే ముందే జాగ్రత్త పడితే మంచిది కదా! ప్రధాని నరేంద్ర మోడీ తలుచుకొంటే ఇదేమీ పరిష్కరించలేనంత పెద్ద సమస్య కాదని అందరికీ తెలుసు. ఏపిలో తాత్కాలికంగా ఎక్కడైనా హైకోర్టు ఏర్పాటు చేసుకోవడం లేదా హైదరాబాద్ లోనే ఏపి లేదా తెలంగాణ హైకోర్టు ఏర్పాటుకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేత ‘ఊ’ అనిపించడం మోడీకి పెద్ద పనేమీ కాదు. అయినా చేయడం లేదంటే ఉద్దేశ్యపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నట్లు అనుమానించవలసి వస్తుంది.