మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై ఇప్పటికే అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రాజెక్టు నిర్వాసితులు ధర్నా చేస్తున్నప్పుడు వారిపై పోలీసులు నిన్న లాఠీ ఛార్జ్ చేయడంతో అక్కడ చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం వలన పరిస్థితులు ప్రతిపక్షాలకి అనుకూలంగా మారినట్లయింది. అందుకు నిరసనగా ప్రతిపక్షాలు నేడు మెదక్ జిల్లా బంద్ కి పిలుపునిచ్చాయి.
తెలంగాణ రాజకీయ జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కూడా నిర్వాసితులపై పోలీసుల లాఠీ ఛార్జ్ చేయడాన్ని గట్టిగా ఖండించారు. ఈరోజు వాళ్ళతో కలిసి ధర్నాలో పాల్గొనడానికి ఆయన బయలుదేరినప్పుడు, పోలీసులు ఆయనని ములుగు మండలం వంటిమామిడి గ్రామం వద్ద అడ్డుకొని నిర్బంధంలోకి తీసుకొనే ప్రయత్నం చేశారు. అందుకు నిరసన తెలియజేస్తూ ఆయన అక్కడే జాతీయ రహదారిపై ధర్నాకి కూర్చొన్నారు. పోలీసులు ఆయనని బలవంతంగా అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి తరలించారు. రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేసినందుకే ప్రభుత్వం చాలా విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంటే, ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరాం ని అరెస్ట్ చేయడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో ఇంతవరకు తెరాస ప్రభుత్వం చాలా సంయమనంగానే వ్యవహరిస్తున్నప్పటికీ, ఈ రెండు చర్యల కారణంగా అకస్మాత్తుగా పరిస్థితులు పూర్తి వ్యతిరేకంగా మారిపోయాయి. ప్రస్తుతం మెదక్, నారాయణ్ ఖేడ్, సిద్ధిపేట, ప్రజ్ఞాపూర్ తదితర ప్రాంతాలలో పూర్తిస్థాయిలో బంద్ జరుగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలలోనే నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా దుకాణాలు, విద్యాసంస్థలు వగైరా కూడా మూతపడ్డాయి.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో అధికార ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పుడే ప్రభుత్వం ఈ సమస్యని గుర్తించి పరిష్కార మార్గాలు ఆలోచించి ఉంటే నేడు పరిస్థితులు ఇంత తీవ్రం అయ్యేవి కావు. కానీ ప్రభుత్వం తన వాదనకి, పంతానికే కట్టుబడి ఉండటంతో సమస్య జటిలం అయ్యింది. దీనిలో ఒక్క ప్రభుత్వానినే తప్పు పట్టలేము. ప్రతిపక్షాలు కూడా తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఈ సమస్యని వాడుకొంటున్నాయి.
నిర్వాసితులు ప్రశాంతంగా ధర్నా చేస్తున్నప్పుడు టిడిపి నేత వంటేరు ప్రతాపరెడ్డి అనుచరులు వెనుక నుండి పోలీసులపై రాళ్ళు విసిరారని దానితో పరిస్థితులు అదుపు తప్పాయని, వారిని నియంత్రించేందుకే తప్పనిసరి పరిస్థితులలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారని మంత్రి హరీష్ రావు చెప్పారు. నిర్వాసితులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, ప్రొఫెసర్ కోదండరాం ని అరెస్ట్ చేయడం, జిల్లా బంద్ వంటివి తమ ప్రభుత్వ గౌరవానికి భంగం కలిగిస్తాయనే సంగతి తెరాస గ్రహిస్తే మంచిది. అదే విధంగా ప్రతిపక్షాలు కూడా ప్రజల తరపున పోరాడటం మంచిదే కానీ, తమ రాజకీయ ప్రయోజనాల కోసం అభివృద్ధికి ఆటంకం కలిగించే పనులు, ఆలోచనలు చేయకుండా ఉంటే మంచిది.