తెలంగాణలో పవర్ కట్స్ లేకుండా చేస్తామని చెప్పిన కేసీఆర్ గారికి దిమ్మతిరిగే షాకిచ్చింది గాంధీ ఆస్పత్రి. అవును హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో నరకానికి దారి చూపించాయి పవర్ కట్స్. ఒకే రోజు గాంధీలో చికిత్స పొందుతున్నవారిలో 21 మంది ప్రాణాలు విడిచారు. సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, నియో-నెటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల విభాగం, అత్యవసర వైద్య విభాగాలకి చెందిన పేషెంట్లు ఈ మృతుల్లో వున్నారు. అయితే, ఇందులో తమ తప్పేమీ లేదని... కేవలం హాస్పిటల్లో విద్యుత్ సరఫరా అందకపోవడం వల్లే ఈ మరణాలు సంభవించాయని హాస్పిటల్ అధికార వర్గాలు ఆరోపిస్తున్నాయి.
"శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి విద్యుత్ పోతూ, వస్తూ వుండటం జరిగింది. ఆ తర్వాత విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అదే సమయంలో హాస్పిటల్లో వున్న 4 జనరేటర్లలో సాంకేతికలోపం తలెత్తిన కారణంగా అవి పనిచేయలేదు. దీంతో కొన్ని అత్యవసర వైద్య సేవల విభాగాలకి విద్యుత్ సరఫరా అందలేదు" అని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఇదిలావుంటే, ఈ ఘటనపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. సి. లక్ష్మా రెడ్డి.. కేవలం విద్యుత్ లేకపోవడం వల్లే ఆస్పత్రిలో ఇంతమంది చనిపోయారని భావించడం సరికాదని అన్నారు. ఇక్కడికి వచ్చే పేషెంట్లలో చాలామంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ చివరి స్టేజ్లో వస్తుంటారు అని మంత్రి అభిప్రాయపడ్డారు.