కరీంనగర్ అభివృద్ధికి ఇండోర్ కలెక్టర్ సహకారం!

మధ్యప్రదేశ్ లో ఇండోర్ కలెక్టర్ తెలంగాణలో కరీంనగర్ అభివృద్ధికి సహకరిస్తున్నారు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ఇండోర్ కలెక్టర్ పరికిపండల నరహరి కరీంనగర్ కి చెందినవారవడమే అందుకు కారణం. కేంద్రప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక పధకాలని ఆయనే రూపొందిస్తుండటం మరో కారణం.

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 స్మార్ట్ సిటీల అభివృద్ధి పధకానికి కరీంనగర్ ని ఎంపిక చేయడంతో, అందుకు అవసరమైన పధకాలు, ప్రణాళికలు వగైరా జిల్లా అధికారులు తయారుచేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. కానీ వాటిలో చాలా లోపాలు ఉండటంతో రెండవ రౌండ్ లో అవి తిరస్కరించబడ్డాయి. మళ్ళీ మూడవ రౌండ్ లో సమర్పించేందుకు వాటిపై అధికారులు కసరత్తు చేస్తున్నప్పుడు, ఇండోర్ లో ఆ పధకాన్ని అద్భుతంగా అమలుచేసి చూపించి ప్రశంసలు అందుకొన్న ఆ జిల్లా కలెక్టర్ పరికిపండల నరహరి కరీంనగర్ రావడం జరిగింది. ఆయన గురించి తెలుసుకొన్న జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే ఆయనని కలిసి తమ సమస్య గురించి వివరించారు.

కరీంనగర్ ని స్మార్ట్ సిటీగా మలిచేందుకు తాను అన్ని విధాల సహకరిస్తానని నరహరి హామీ ఇచ్చారు. ఈ విధంగా తన జన్మభూమి రుణం తీర్చుకొనే అవకాశం కలిగినందుకు చాలా సంతోషిస్తున్నానని ఆయన చెప్పడం విశేషం. ముందుగా వారినందరినీ ఇండోర్ వచ్చి అక్కడ తాము ఆ పథకాలని ఏ విధంగా అమలుచేశామో అధ్యయనం చేయమని కోరారు.

ఎంపి వినోద్, ఎమ్మెల్యే గంగుల కరుణాకర్, మేయర్ రవీంద్ర, డిప్యూటీ మేయర్ రమేష్, మున్సిపల్ కమీషనర్ కృష్ణ భాస్కర్, ఇంజనీర్ మోహన్ కుమార్ తదితరులు ఇండోర్ వెళ్ళారు. అక్కడ స్మార్ట్ సిటీ పథకం ద్వారా ఎటువంటి అభివృద్ధి పనులు చేప్పట్టారో, వాటి వలన నగర ప్రజలు ఎటువంటి ప్రయోజనాలు పొందుతున్నారో, కరీంనగర్ అవసరాలకి, భౌగోళిక పరిస్థితులకి తగ్గట్లుగా ఏవిధమైన పథకాలు రూపొందించుకోవాలో, వాటి కోసం ఏ విధంగా ప్రతిపాదనలు, ప్రణాళికలు తయారు చేయాలో వంటి అన్ని వివరాలని నరహరి వారికి అందిస్తున్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం తను అన్నివిధాల వారికి సహాయసహకారాలు అందిస్తానని చెప్పారు. నరహరి వంటివారిని స్పూర్తిగా తీసుకొని దేశవిదేశాలలో ఉన్న తెలంగాణ మేధావులు, వివిధ రంగాలలో నిపుణులు రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తే బాగుంటుంది కదా.