కెసిఆర్ ఉపాయం ఫలించింది..మోడీ వస్తున్నారు

తెలంగాణా రాష్ట్రం ఏర్పడి రెండేళ్ళయినా ప్రధాని నరేంద్ర మోడీ ఇంతవరకు ఒక్కసారి కూడా తెలంగాణా గడ్డపై అడుగుపెట్టలేదు. ఒకవేళ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహ్వానించకపోయుంటే ఇంకా ఎప్పుడు వచ్చేవారో కూడా తెలియదు. ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణాకి రప్పించడానికి కెసిఆర్ చేసిన ఉపాయం బాగానే ఫలించినట్లుంది. తెరాస ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, భాగీరధ పధకాలని కేంద్రప్రభుత్వం కూడా మెచ్చుకొంటోంది కనుక వాటినే చూపించి ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణాకి రప్పిస్తున్నారు కెసిఆర్.

ఇటీవల కెసిఆర్ డిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు, ఆగస్ట్ 7న గజ్వేల్ లో మిషన్ భగీరథ పధకాన్ని ప్రారంభించేందుకు రావలసిందిగా ఆహ్వానించారు. వరంగల్లో మిషన్ కాకతీయ పైలాన్ ఆవిష్కరణ కూడా చేయాలని అభ్యర్ధించారు. అందుకు మోడీ వెంటనే అంగీకరించారు. ప్రధాని కార్యాలయం ఆయన పర్యటన ఖరారు చేసి తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం అందించింది. ఆయన చేతుల మీదుగానే మరికొన్ని ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేయించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసి ప్రధాని కార్యాలయానికి పంపినట్లు తెలుస్తోంది. వాటిలో రామగుండంలో ఎన్టిపిసి ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి, వరంగల్ ల్లో కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి, అదే జిల్లాలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకి ప్రధాని నరేంద్ర మోడీ చేతే శంఖుస్థాపన చేయించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని కార్యాలయం వాటిని ఖరారు చేస్తే కెసిఆర్ ప్రయత్నాలు ఫలించినట్లే!

ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడూ విదేశాలలోనే పర్యటిస్తుంటారు...భారత్ లో ఉన్నపుడు ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో మాత్రమే తరచూ పర్యటిస్తుంటారనే విమర్శలు మూటగట్టుకొన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఎటువంటి ఎన్నికలు లేవు కనుక ఈ పర్యటనతోనైనా ఆ విమర్శలు తగ్గుతాయేమో చూడాలి.