ఓటుకి నోటు కేసు ఏపి, తెలంగాణా రాష్ట్రాలలోనే కాకుండా యావత్ దేశంలోనూ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఆ కేసుతో తెలంగాణలో రాజకీయ బలాబలాలు ఒక్కసారిగా మారిపోయాయి. అంతవరకు తెలంగాణలో తెరాసని గట్టిగా సవాలు చేస్తున్న టిడిపి, ఈ కేసుతో మళ్ళీ ఎన్నడూ కోలుకోలేనంతగా దెబ్బ తింది. అంతవరకు హైదరాబాద్ ని, తెలంగాణ రాజకీయాలపై తన పట్టుని వదులుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడని చంద్రబాబు నాయుడు, ఆ దెబ్బతో విజయవాడకి వెళ్ళిపోవడం, తెలంగాణ రాజకీయాలకే కాకుండా తన పార్టీకి కూడా దూరం అయిపోవడం, ఆ కారణంగా తెలంగాణలో టిడిపి ఇంకా బలహీనపడటం అందరికీ తెలిసిందే. బహుశః మన దేశంలో అంత సంచలనం సృష్టించిన పకడ్బందీ కేసు ఎవరూ ఎన్నడూ చూసి ఉండరేమో. ఆ తరువాత జరిగిన పరిణామాల గురించి అందరికీ తెలిసిందే.
తాజాగా మళ్ళీ ఆ కేసులో చిన్న కదలిక వచ్చింది. దానిలో నిందితులుగా ఉన్ననలుగురిలో ఒకడైన జెరూసలెం మత్తయ్యకి సుప్రీం కోర్టు నోటీసు జారీ చేసింది. ఆ కేసుతో అతనికి సంబంధం లేదని భావించిన హైకోర్టు కొన్ని రోజుల క్రితమే అతనికి విముక్తి కల్పించింది. హైకోర్టు తీర్పుని తెలంగాణ ఎసిబి సుప్రీం కోర్టులో సవాలు చేయగా, దానిని విచారణకి స్వీకరించిన న్యాయస్థానం నెలరోజులలోగా వివరణ ఇవ్వాలని నోటీస్ లో పేర్కొంది. ఒకవేళ ఎసిబి ఈ కేసుని మళ్ళీ వేగవంతం చేస్తే, మళ్ళీ రెండు ప్రభుత్వాల మద్య ఘర్షణ వాతావరణం తప్పకపోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితిలో అటువంటి అవసరమేమీ లేదు కనుక ఎసిబి మత్తయ్య కేసుకి మళ్ళీ ఏదో ఒక దశలో మళ్ళీ బ్రేకులు వేయవచ్చు.