ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు ఓ తల్లీకూతుళ్లు. 30ఏళ్ల తర్వాత తమ తల్లి కోసం వచ్చిన అక్కాచెల్లెల్ల కలను సాకారం చేశారు హైదరాబాద్ పోలీసులు. అసలు ఈ 30ఏళ్ల తల్లీ కూతుళ్ల కథ ఏంటో తెలుసా..? 30 ఏళ్ల క్రితం.. హైదరాబాద్‌కు చెందిన నజియాను దుబాయ్‌కు చెందిన షేక్ పెళ్లి చేసుకున్నాడు. తర్వాత నజియాను తీసుకుని దుబాయ్ వెళ్లిపోయాడు. వారికి అక్కడ ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. అమ్మాయిలు పుట్టిన తర్వాత షేక్.. నజియాను బలవంతంగా హైదరాబాద్‌కు పంపించేశాడు. పిల్లలను మాత్రం తనవద్దే ఉంచేసుకున్నాడు. ఒంటరిగా హైదరాబాద్‌కు వచ్చిన నజియా కు తన బతుకేంటో అర్థంకాని పరిస్థితి. కుటుంబ సభ్యుల ఒత్తిడితో రెండో పెళ్లి చేసుకుంది.
అటు.. దుబాయ్‌లో పెరిగి పెద్దయిన నజియా ఇద్దరు పిల్లలు ఫాతిమా, ఆయేషా.. తమ తల్లి ఎక్కడుందో తెలుసుకోవాలనుకున్నారు. అమ్మను ఒక్కసారైనా కలుసుకోవాలని ఆరాటపడ్డారు. జనవరిలో హైదరాబాద్ కు వచ్చారు. కానీ.. తల్లి వివరాలు తెలియరాలేదు. అసలు వాళ్ల దగ్గరే వివరాలు లేవు. దీంతో.. తల్లి నజియాను కనుక్కోలేక మనోవ్యధకు గురయ్యి హైదరాబాద్ పోలీసులను సంప్రదించారు.
నజియాకు సంబంధించిన ఫాతిమా, ఆయేషా వద్ద ఉన్నది కేవలం ఓ చిన్న ఫొటో మాత్రమే. దీంతో.. పోలీసులకు దర్యాప్తు కష్టంగా మారింది. ఐతే.. 30 ఏళ్ల క్రితం తమనుంచి దూరమైన తల్లి కోసం.. ఆయేషా, ఫాతిమా ఆవేదనకు చలించిన పోలీసులు అన్ని రకాలుగా ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ఎట్టకేలకు ఆరునెలల తర్వాత నజియా ఆచూకీ తెలుసుకోగలిగారు. అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత ఫాతిమా, ఆయేషాలకు విషయం తెలిపారు.
30 ఏళ్ల తర్వాత తన బిడ్డలను కలుసుకున్న నజియా ఆనందంతో కన్నీటి పర్యంతమైంది. అటు.. ఎప్పుడో విడిపోయిన తల్లిని చూడగానే ఫాతిమా, నజియా చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టారు. ఆనందబాష్పాలు పొంగిపొరలాయి. ఇన్ని రోజులకు తమ తల్లిని కలుసుకోవడం సంతోషంగా ఉందంటున్నారు నజియా పిల్లలు. నజియాను కలుసుకోవడంలో తమకు సహకరించిన హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.