తెలంగాణలో జిల్లాల పునర్విభజనకు రంగం సిద్ధం చేస్తుండడం రాజకీయ నేతల్లో మరిన్ని ఆశలు పెంచుతోంది. అధికార పార్టీ నేతలు సహా ప్రతిపక్ష నేతలు కూడా జిల్లాల ఏర్పాటుపై ఉత్సాహంగా ఉన్నారు. కొత్త జిల్లాలకు నాయకత్వం వహించేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు.తెలంగాణ రాష్ట్రం మరికొన్ని రోజుల్లో దాదాపు 24 జిల్లాలుగా ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు పూర్తయింది. దసరా నాటికి కొత్త జిల్లాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.
ప్రస్తుతం పది జిల్లాలకు అనుగుణంగా రాష్ట్ర మంత్రి వర్గంలో నేతలకు చోటు దక్కింది. ఆ జిల్లాల ఆధారంగానే ఇప్పటి వరకు అన్ని పనులను ప్రభుత్వ పరంగా నిర్వహణ జరుగుతోంది. అయితే భవిష్యత్ లో ఏర్పడే జిల్లాల ద్వారా రాజకీయ పార్టీల నేతలు తమ దశ, దిశ మారుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఇప్పుడున్న నేతలతో పాటు మరికొంత మందికి కేబినేట్లో అవకాశం దక్కనుంది. పార్టీ పరంగా కొత్త జిల్లాల్లో పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసే బాధ్యతలు తమకు దక్కుతాయని అధికార పార్టీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. విపక్ష పార్టీల నేతలు కూడా కొత్త జిల్లాలో పట్టు సాధించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై దృష్టి పెడుతున్నారు. నాలుగైదు నియోజకవర్గాలకు ఓ జిల్లా ఏర్పాటు కానుండడంతో స్థానికంగా మరింత పట్టు బిగించే యత్నాలను నేతలు మొదలు పెట్టారు.