తెలంగాణను ఇండస్ట్రియల్ హబ్ గా మార్చేందుకు సర్కార్ చేపట్టిన చర్యల్లో మరో ముందడుగు పడింది. రాష్ట్రంలో డ్రైపోర్టు ఏర్పాటు కానుంది. డ్రైపోర్టు ఏర్పాటుకు ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ రీసెర్చ్ చేసి.. రాష్ట్రంలో నాలుగు ప్రాంతాలు అనువైనవిగా గుర్తించింది. నల్లగొండ జిల్లాలోని భువనగిరి, దామరచర్ల, మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల, మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రాంతాలు అనువైనవిగా తేల్చింది. ఈ నాలుగింటిలో భువనగిరి మేలని సూచించింది. దీనిపై సీఎం కేసీఆర్ త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు.
టీఎస్‌ఐపాస్ తో దాదాపు రెండువేలకు పైగా పరిశ్రమలు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్నాయి. ఈ పరిశ్రమల అవసరాలకు, ముఖ్యంగా సరుకు రవాణాకు అనువుగా డ్రై పోర్టును నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సాంకేతికంగా, రవాణా పరంగా డ్రైపోర్టును ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై అధ్యయనం కోసం ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. నాలుగు ప్రాంతాలను డ్రై పోర్టుకు అనువైనవిగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ సూచించింది.
దామరచర్లలో మూడు వేల ఎకరాలు, జహీరాబాద్‌లో 825 ఎకరాలు, భువనగిరిలో 450 ఎకరాలు, జడ్చర్లలో 320 ఎకరాల భూమి అందుబాటులో ఉందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ తన నివేదికలో తెలిపింది. ఈ ప్రాంతాలకు రవాణా సదుపాయాన్ని ప్రధానమైన అర్హతగా తీసుకున్నారు. ఈ నాలుగింటికి రైలు, జాతీయ రహదారుల సౌకర్యం అందుబాటులో ఉంది. ఇక డ్రై పోర్టును నిర్మించే ప్రాంతంలో కంటైనర్ యార్డ్, పారిశ్రామిక గిడ్డంగులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇతర సదుపాయాల్లో కార్యాలయం, సమావేశాలు, నైపుణ్య అభివృద్ధి కేంద్రం, హోటళ్లు, దవాఖానాను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రం నుంచి విదేశాలకు ఎగుమతులను ప్రోత్సహించడానికి, ఇక్కడి ఉత్పత్తులను సులువుగా రవాణా చేయటం కోసం డ్రై పోర్ట్ ను ఏర్పాటు చేస్తున్నారు.