ఏపికి మళ్ళీ హ్యాండిచ్చిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకే కాదు, ఏపికి కూడా పదేపదే హ్యాండ్ ఇస్తూనే ఉంది. తెలంగాణకి హైకోర్టు విభజన, వెనుకబడిన జిల్లాలకి నిధుల విడుదల వంటి రెండు మూడు హామీలపైనే హ్యాండ్ ఇస్తోంది. కానీ తెదేపా ఎంతైనా మిత్రపక్షం, ప్రభుత్వంలో భాగస్వామి కూడా కనుక ఏపికి స్పెషల్ ట్రీట్ మెంట్ ఇస్తోంది. అంటే అదనంగా ఏదో ఇచ్చేయడం లేదు.. ప్రత్యేక హోదా, రైల్వేజోన్, మెట్రో రైల్ ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు...ఇలా ఓ అరడజను హామీలని ఒక్కొక్కటి తీసి పక్కనపెట్టేసింది. అయినా ఏపి సిఎం చంద్రబాబు వాటి కోసం గట్టిగా పట్టుబట్టరు. కారణాలు అందరికీ తెలిసినవే.

ఇవ్వాళ కూడా మోడీ ప్రభుత్వం ఏపి ప్రజలకి మళ్ళీ మరోసారి హ్యాండ్ ఇచ్చేసింది. కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్ర రావు హోదా కోసం పెట్టిన ప్రైవేట్ బిల్లుపై ఓటింగ్ జరుపకుండా క్రిందటిసారి పార్లమెంటు సమావేశాలలో మోడీ ప్రభుత్వం చాలా తెలివిగా తప్పించుకొంది. మళ్ళీ ఈరోజు కూడా అలాగే తెలివిగా తప్పించుకొంది. ఆ బిల్లుపై ఓటింగ్ మొదలయ్యే సమయానికి భాజపా సభ్యులు రాజ్యసభలో చాలా రభస చేశారు. దానితో ఆ బిల్లుపై ఓటింగు చేపట్టాక మునుపే సభని సోమవారానికి వాయిదా పడింది. ఇక ఆ బిల్లుపై మళ్ళీ రెండువారాల వరకు ఓటింగ్ జరిగే అవకాశమే లేదు.

అప్పుడు కూడా ఇలాగే మరొక్కసారి తిప్పికొడితే మళ్ళీ సమావేశాల వరకు తప్పించుకోవచ్చు. తెదేపా, భాజపాలు తెలివిగా తప్పించుకొన్నందుకు చాలా సంతోషిస్తుండొచ్చు. కానీ తమ గురించి ప్రజలు ఏమని ఆలోచిస్తున్నారో తెలుసుకొంటే ఇంకా మంచిది కదా! అదే కేంద్రం తెలంగాణకి హ్యాండిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఊరుకొని ఉండేదా?