కొత్తకోట దయాకర్ రెడ్డి అలా పాయింట్ తీశారు

తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్రంలో జరుగుతున్న రగడ అందరూ చూస్తూనే ఉన్నారు. ఆపరేషన్ ఆకర్షతో ప్రతిపక్ష పార్టీలన్నిటినీ నిర్వీర్యం చేసేశామనే తెరాస సంతోషాన్ని ఆవిరి చేసేస్తూ దానిని ప్రతిపక్ష పార్టీలు చాలా పరేషాన్ చేస్తున్నాయి. ఈ పరేషాన్ కార్యక్రమంలో తెదేపా, భాజపాలు కూడా ఆ ప్రాజెక్టుల విషయంలో దూకుడుగానే వ్యవహరిస్తున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్లు కనబడుతోంది.

ఆ ప్రాజెక్టులలో భారీ అవినీతి జరుగుతోందనే ప్రతిపక్ష పార్టీల వాదనతోనే చాలా ఇబ్బందిపడుతున్న తెరాస ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ హర్యానా నుంచి పట్టుకొచ్చిన కొత్త ఫార్ములా అదే...రిజర్వాయర్లు లేకుండా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడంపై అందరూ చర్చిస్తుండటంతో ఇంకా ఇబ్బందిపడుతున్నట్లు కనిపిస్తోంది. ఓటుకి నోటు కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఆ ప్రాజెక్టులలో అవినీతి గురించి గట్టిగానే మాట్లాడుతున్నారు. తెదేపా నేత కొత్తకోట దయాకర్ రెడ్డి కూడా ఆయనతో గొంతు కలిపి ఒక లా పాయింట్ తీసి ముఖ్యమంత్రి కెసిఆర్ ని విమర్శించారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సాగునీటి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వివాదాలు ఏర్పడుతాయని తెలిసి ఉన్నప్పుడు తెరాస ప్రభుత్వం ముందే ఎపెక్స్ కమిటీ ఏర్పాటు కోసం గట్టిగా ప్రయత్నించి, దాని ముందు ఉంచి ఉంటే బాగుండేది. ఏపి ప్రభుత్వం దాని కోసం ప్రతిపాదన చేసినప్పుడు కెసిఆర్ స్పందించకుండా ఊరుకొన్నారు. సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసిన తరువాత మేల్కొని, ఆ తీర్పు మనకే అనుకూలమని గొప్పగా చెప్పుకొంటూ ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ప్రాజెక్టు పనులలో జరుగుతున్న అవినీతిని దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నారు,” అని ఆరోపించారు.