హైకోర్టు విభజనపై ఏపి ద్వంద వైఖరి

హైకోర్టు విభజన కోసం తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్ళుగా అన్నివిధాల ప్రయత్నిస్తోంది. కానీ కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిపై దాగుడు మూతలు ఆడుతున్నందున సాధ్యం కాలేదు. హైకోర్టు విభజన జరుగకపోగా జడ్జీల కేటాయింపులో కూడా తెలంగాణ పట్ల వివక్ష చూపడంతో న్యాయవాదులు, న్యాయమూర్తులు భగ్గుమన్నారు. చివరికి వారు రోడ్లెక్కవలసి రావడం, న్యాయమూర్తుల సస్పెన్షన్ వంటి దారుణమైన పరిస్థితులు చూడవలసి వచ్చింది. ఆ కారణంగా రాష్ట్రంలో చాలా రోజుల పాటు న్యాయవ్యవస్థ స్తంభించిపోయింది. ఇటువంటి దుస్థితి మరే రాష్ట్రానికి రాలేదు. అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలుగజేసుకొని వారి సమస్యలని పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో, వారు ఆయన మాటకి గౌరవమిచ్చి ఆయన సూచన మేరకు మళ్ళీ విధులలో చేరారు.

హైకోర్టు విభజనపై మళ్ళీ నిన్న హైకోర్టులో విచారణ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ద్వంద వైఖరి మరొకసారి కళ్ళకి కట్టినట్లు కనబడింది. “హైదరాబాద్ నే వదులుకొన్న వాళ్ళం.. హైకోర్టు కోసం గొడవ పడతామా? హైకోర్టు విభజనకి మేము అడ్డుపడటం లేదు. దానికోసం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో చర్చించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను,” అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన సంగతి అందరికీ తెలుసు. కానీ నిన్న హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదించిన ఆ రాష్ట్ర ఏజి దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. “ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఏపికి హైకోర్టు ఏర్పాటు చేసుకొనేంత వరకు హైదరాబాద్ లో ఉమ్మడి హైకోర్టు కొనసాగాలి. ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు ఏర్పాటు చేసుకోవడానికి నిర్ణీత గడువు ఏదీ విభజన చట్టంలో లేదు,” అని చెప్పడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ద్వంద వైఖరికి అద్దం పడుతోంది.

హైకోర్టు విభజనకి ఏపి ప్రభుత్వం వెనుకాడటానికి చాలా కారణాలున్నాయి. వాటి గురించి వేరేగా చెప్పుకోవలసి ఉంటుంది. కానీ “హైకోర్టు విభజనకి అభ్యంతరం లేదు. అడ్డుపడటం లేదని” చంద్రబాబు చెపుతున్నప్పుడు, కనీసం హైదరాబాద్ లోనే ఏపి లేదా తెలంగాణకి వేరేగా హైకోర్టు ఏర్పాటు చేసుకొనేందుకు సహకరిస్తామని చెప్పవచ్చు. కానీ అందుకు కూడా చంద్రబాబు ఇష్టపడటం లేదని దమ్మాలపాటి శ్రీనివాస్ వాదన వింటే స్పష్టం అవుతోంది.