రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్. ప్రాజెక్టుల రీడిజైనింగ్ తో ఏపీకి నష్టం లేదన్నారు. అన్ని ప్రాజెక్టులు కట్టినా… వృథాగా పోయే నీళ్లలో నాలుగోవంతు మాత్రమే వినియోగించుకుంటామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని.. వీటి నిర్మాణానికి అవసరమయ్యే భూసేకరణ వేగంగా జరిగేలా జిల్లా అధికారులు చొరవ చూపించాలన్నారు. ఇరిగేషన్ కోసం ఏటా 25వేల కోట్లు కేటాయిస్తున్నామన్నారు. ప్రతి నెలా 2వేల కోట్లు ఇరిగేషన్ శాఖకు కేటాయించాలని ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలిచ్చారు. ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తామన్నారు.
ప్రతి సంవత్సరం కృష్ణా గోదావరి నదుల నుంచి 4వేల 5వందల టీఎంసీలు సముద్రంలోకి వృథాగా పోతున్నాయనీ, వీటిని సమర్థవంతంగా వాడుకునేందుకే.. ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేశామన్నారు కేసీఆర్. ప్రాజెక్టులు అన్నీ పూర్తయినా… తెలంగాణ వాడుకునేది వెయ్యి టీఎంసీలేననీ, మిగతాదంతా ఏపీకే వెళ్తుందన్నారు. రెండు రాష్ట్రాల రైతులు బాగుండాలనే తాను కోరుకుంటున్నాననీ.. నీరు వృథా పోకుండా ఏపీ కూడా ప్రాజెక్టులు కట్టుకోవాలన్నారు కేసీఆర్.
ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టుపైన చర్చించిన సిఎం…. దీనికి సంబంధించిన డిజైన్లను పరిశీలించారు. ప్రస్తుతం దుమ్ముగూడెం దగ్గర నిర్మించిన బ్యారేజీ ద్వారా నీటిని లిఫ్ట్ చేసి సీతారామ ప్రాజెక్టును నిర్వహించాలని సూచించారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంపై ఎల్ అండ్ టీ కంపెనీ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను పరిశీలించారు. భవిష్యత్తులో ప్రస్తుతం ఉన్న బ్యారేజీకి 200 మీటర్ల కిందికి మరింత ఎత్తులో బ్యారేజీ నిర్మించి మొత్తం ఖమ్మం జిల్లా అవసరాలు తీర్చే విధంగా సాగునీటి వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు.
ఇలా చెయ్యడం వల్ల 22 టీఎంసీల నీరు నదిలోనే నిల్వ ఉండడంతో పాటు దాదాపు 31 కిలోమీటర్ల వరకు నదిలో నీరు నిలుస్తుందని తెలిపారు. ఎలాంటి ముంపు లేకుండా నీటిని వాడుకోవచ్చన్నారు. ఈ డిజైన్ వల్ల దాదాపు 320 మెగావాట్ల విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేసుకోవచ్చని తెలిపారు. భవిష్యత్‌లో కృష్ణానదిలో జలాలు లేకున్నా సరే ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లా వ్యవసాయానికి ఢోకా లేని పరిస్థితి తేవాలన్నారు సీఎం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక, అంచనాలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత త్వరగా పూర్తయితే తెలంగాణ రైతులకు అంత ప్రయోజనమని తెలిపారు సీఎం కేసీఆర్.