రోడ్ల నిర్వహణ, నిర్మాణంపై కేటీఆర్ గుస్సా

గ్రేటర్ హైదరాబాద్ పై స్పెషల్ కేర్ తీసుకుంటున్న కేటీఆర్ మరోసారి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతవారంలోనే కేపీహెచ్బిలోని రోడ్ల నిర్మాణంపై గుస్సా అయిన కేటీఆర్ మరోసారి ఆగ్రహించారు. గ్రేటర్‌లో రోడ్ల నిర్వహణ అద్వానంగా ఉందని, మరమ్మతులు చేయాలని ఆదేశాలిచ్చినా పనులు జరగకపోవడంపై మంత్రి కేటీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వెయ్యి కిలోమీటర్ల మేర వైట్‌ట్యాపింగ్‌ రోడ్ల నిర్మాణాన్ని దశలవారీగా నిర్మించాలని నిర్ణయించారు. 

వారం రోజుల్లో రోడ్ల మరమ్మతులపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని కేటీఆర్‌ ఆదేశించినట్టు మేయర్‌ రామ్మోహన్‌ చెప్పారు. ఈ పనులను మంత్రి, మేయర్‌, కమిషనర్‌లు కలిసి తనిఖీలు చేయనున్నారన్నారు. గ్రేటర్‌లో గుంతల రోడ్లకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టడానికి 24/7 పనిచేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. విదేశాల్లో జలాశయాల శుద్ధికి బయోడిగ్రేడబుల్‌ ఫంగస్‌ను వినియోగిస్తున్నారని, హుస్సేన్‌ సాగర్‌లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి శుద్ధి చేసేందుకు పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇటీవల తీసుకున్న చర్యలతో ట్యాంక్‌బండ్‌లో కాలుష్యం స్థాయి తగ్గినట్టు ఇపిటిఆర్‌ఐ నివేదిక తెలిపిందన్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా కాలుష్యం తగ్గించడానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో హుస్సేన్‌సాగర్‌ను మరింత స్వచ్చంగా తీర్చిదిద్దడానికి హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, జలమండలి, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులు సంయుక్తంగా ప్రణాళిక రూపొందించాలని కేటీఆర్‌ ఆదేశించినట్టు చెప్పారు.