టిఆర్ఎస్ కు పార్లమెంట్ భయం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారాన్ని చేత పట్టిన ఉద్యమ పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఆపరేషన్ ఆకర్ష ను ప్రవేశపెట్టిన కేసీఆర్ ప్రతిపక్ష నాయకులతో పాటు పార్టీలను తమ పార్టీలో విలీనం చేసుకోవడం జరిగింది. అయితే, ప్రతిపక్ష పార్టీల మనుగడను రుపుమాపడానికి గులాబీ నేత పన్నిన పన్నాగంలో ఆ పార్టీనే చుక్కులో పడేలా ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను 11 సీట్లు గెలుచుకున్న టీఆర్‌ఎస్‌లోకి ఈ ఏడాది ముగ్గురు ఎంపీలు ఫిరాయించడం తెలిసిందే. దీంతో తమ ఎంపీల ఫిరాయింపులపై వైఎస్సార్ కాంగ్రెస్, తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకోవడమే కాకుండా సీఎం కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే తెలంగాణ టీడీపీకి చెందిన మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి సైతం ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోనే కేసీఆర్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పార్టీ మారే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకవేళ పార్టీ నాయకత్వం తనపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకంటూ గుత్తా టీఆర్‌ఎస్ కండువా కప్పు కోలేదు.

అయినా ఆయన టీఆర్‌ఎస్‌లో చేరినట్లు రుజువు చేసే ఆధారాలను కాంగ్రెస్ సిద్ధం చేసుకుందని చెబుతున్నారు. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఆయా పార్టీలు ఫిరాయింపు ఎంపీలపై ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.ఎమ్మెల్యేలకు గులాబీ కండువాలు కప్పడంలో దూకుడుగా వ్యవహరించిన టీఆర్‌ఎస్ ఎంపీల విషయంలోనూ అదే తరహాలో వ్యవహరించడం వల్లే కొత్త చిక్కులకు అవకాశం ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.