కేటీఆర్‌తో భేటీ అయ్యాక రాజకీయ సన్యాసం!

సాధారణంగా ప్రతిపక్షపార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయ్యారంటే వారు తెరాసలో చేరబోతున్నారని అర్ధం. టిడిపి కెపిహెచ్‌బి కార్పొరేటర్ మందడి శ్రీనివాస్ రావు కూడా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి బుదవారం ఉదయం తెలంగాణ భవన్‌కు వెళ్ళి కేటీఆర్‌ను కలిశారు. ఆయనతోపాటు కూకట్‌పల్లికి చెందిన మరికొందరు టిడిపి కార్యకర్తలు కూడా తెరాసలో చేరేందుకు సిద్దం అయ్యారు. కానీ అంతలోనే ఏమయిందో తెలియదు కానీ మందడి అనూహ్య నిర్ణయం తీసుకొన్నారు. టిడిపి సభ్యత్వానికి, తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు మందడి బుదవారం రాత్రి ప్రకటించారు. 

లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలో పోటీ చేయకూడదని టిడిపి నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ నాయకత్వం చేతులుముడుచుకొని కూర్చోవడం వలన పార్టీలో కొనసాగి ప్రయోజనం లేదని మందడి భావిస్తున్నారని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. తెరాసలోకి వెళ్లాలని మొదట భావించినా మళ్ళీ మనసు మార్చుకొని ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. తెరాసలోకి వెళ్ళినా అందులో కూడా పదవులు, టికెట్ల కోసం తీవ్రపోటీ నెలకొని ఉన్నందున దానిలోకి వెళ్ళినా ప్రయోజనం ఉండదని మందడి భావించారేమో?