
వైసీపీ నాయకుడు వివేకానందరెడ్డి హత్యకేసులో మొదటి నుంచి మాట మార్చిన ఆ పార్టీ తాజాగా మరో యూ టర్న్ తీసుకొంది. వికానందరెడ్డి కుమార్తెకు వైసీపీతో సంబందం లేకపోయినప్పటికీ మొదట సిట్ దర్యాప్తుకు అందరూ సహకరించాలని కోరిన ఆమె ఇప్పుడు సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని కోరుతున్నారు.
ఆమె నిన్న మీడియాకు విడుదల చేసిన ఒక ఆడియో ప్రకటనలో, “నా తండ్రి మరణించారని తెలిసి మేమందరం కారులో హైదరాబాద్ నుంచి పులివెందులకు వస్తుంటే, ఘటనా స్థలానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ చేరుకొన్నారని అక్కడున్న వారు మాకు ఫోన్లో చెప్పారు. మరి ఆయన అక్కడే ఉన్నపుడు, మా తండ్రిగారి శవాన్ని బాత్ రూములో నుంచి బెడ్ రూములోకి ఎందుకు తరలించారు? ఆ తరువాత ఆయన తలకు ఎందుకు కట్టు కట్టించారు? శవపంచనామా చేయకుండా ఇవన్నీ చేయడం నేరమని సర్కిల్ ఇన్స్పెక్టరుకు తెలియదా?తెలిసీ ఎందుకు చేయించారు? ఎవరు చెపితే ఆయన ఇవన్నీ చేయించారు? సిట్ బృందం ఇన్ని రోజులుగా దర్యాప్తు చేస్తున్నా ఇంతవరకు మా తండ్రిగారి హత్యకు సంబందించి ఆధారాలు ఎందుకు సేకరించలేదు?ఇంతవరకు ఎవరినీ ఎందుకు పట్టుకోలేదు? ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మా తండ్రిగారి హత్యను కొందరు రాజకీయంగా ఉపయోగించుకొని లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నట్లు మాకు అనుమానం కలుగుతోంది. అసలు సిట్ దర్యాప్తు చేస్తోందా లేదా అనే అనుమానం కలుగుతోంది. కనుక సిబిఐ చేత దర్యాప్తు జరిపించి దోషులను పట్టుకోవాలని కోరుతున్నాను,” అని అన్నారు.
ఆశ్చర్యకరమైనా విషయమేమిటంటే, ఇప్పటి వరకు ఇవే ప్రశ్నలను చంద్రబాబునాయుడు, టిడిపి నేతలు జగన్‌మోహన్‌రెడ్డిని అడుగుతున్నారు. “వివేకా హత్య జరిగిన తరువాత గుండెపోటు వచ్చిందని ఎందుకు అబద్దం చెప్పారు? హత్య అని తెలిసిన తరువాత శవాన్ని బాత్ రూములో నుంచి బెడ్ రూములోకి ఎందుకు తరలించారు? ఆయన తలకు కట్టు కట్టి గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం ఎందుకు చేశారు? ఇంట్లో రక్తం కడిగి, రక్తంతో తడిసిన బెడ్ షీట్లను ఎందుకు మార్చారు? ఎవరి ఆదేశాలతో ఇవన్నీ చేశారు? శవపంచనామా చేయకుండా ఇవన్నీ చేయడం నేరమని మీకు తెలియదా? మొదట గుండెపోటుతో చనిపోయాడని చెప్పిన మీరు శవాన్ని పోస్ట్ మార్టం తరలించగానే హత్య జరిగిందని ఎందుకు అనుమానాలు వ్యక్తం చేశారు? అసలు హత్యను గుండెపోటుగా చిత్రీకరించాలని ఎందుకు ప్రయత్నించారు? ఏ సంస్థ దర్యాప్తు చేసినా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని రెండు రోజుల క్రితం కోరిన వివేకానందరెడ్డి కుమార్తె ఇప్పుడు సిట్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని కోరడంలో అర్ధం ఏమిటి? ఆమెను ఆవిధంగా ఎవరు చెప్పమని ఒత్తిడి చేశారు?” అని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.