ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రాస్ రోడ్స్ వద్ద నిలబడి ఎటువైపు పయనిస్తే గమ్యం చేరుకొంటుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉంది. పార్టీలో అంతర్గతంగా కుమ్ములాటలు...మరోవైపు తెరాస ఆకర్షణ..పార్టీ పరిస్థితిని చక్కదిద్దే ఆసక్తి, ఓపిక అధిష్టానానికి లేకపోవడం, ఉన్నా ఎంచేయాలో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. తెరాసలోకి వెళ్లిపోదామనుకొంటే ఇప్పటికే హౌస్ ఫుల్ బోర్డు పెట్టేసింది కనుక వెళ్ళినా ఎక్కడో మూలాన సర్దుకొని కూర్చోవాలి. తెదేపా పరిస్థితి కూడా అంతంత మాత్రమే కనుక దానిలో చేరి ప్రయోజనం లేదు. భాజపాలో చేరడానికి మనసొప్పదు..చేరినా దాని పరిస్థితి అలాగే ఉంది. కనుక ఏదారి కనబడని వారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తమ ఉనికిని చాటుకొంటూ తమ రాజకీయ మనుగడకి ఢోఖా లేకుండా జాగ్రత్తపడుతున్నారు.
బహుశా పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా ఆ ప్రయత్నంలో భాగంగానే బుధవారం ఖమ్మంలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేశారు. ఎందుకంటే జిల్లాలోని రాజీవ్ ఇందిరాసాగర్ ప్రాజెక్టు పేరుని మార్చినందుకు నిరసనగా దీక్ష చేశారు. ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినా ఆయన పట్టించుకోలేదని అందుకే నిరసన తెలియజేస్తూ దీక్ష చేశానని చెప్పారు. సాయంత్రం కాగానే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క వచ్చి ఆయనకి నిమ్మరసం త్రాగించి దీక్ష విరమింపజేశారు. ఒక్కరోజు దీక్ష వలన తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోదని బహుశా పొంగులేటికి కూడా తెలిసే ఉంటుంది. అదే విధంగా ఆ దీక్షతో జిల్లా ప్రజల దృష్టిని ఆకట్టుకోవచ్చని కూడా తెలిసే ఉంటుంది. కనుక ఏదో ఒక ప్రయోజనం నెరవేరినందుకు సంతోషించక తప్పదు.