కుక్కలను సజీవంగా మంటల్లో వేశారు

మొన్న తమిళనాడులో ఓ వైద్య విద్యార్థి మేడ మీద నుంచి కుక్కను పడేసిన ఘటన మరువక ముందే.. మరో అమానుష ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. కొంతమంది మైనర్ యువకులు తమ పైశాచిక ఆనందం కోసం మూడు మూగజీవాల ప్రాణాలను బలిగొన్నారు. మూడు కుక్కలను దారుణంగా మంటల్లో పడేసి చంపి ఆ దారుణాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా, ఆ ఆకతాయిలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ముగ్గురు యువకులు కొన్ని రోజుల క్రితం కుక్కలను దారుణంగా మంటల్లో పడేసి కాల్చి చంపేశారు. అగ్ని కీలలకు తట్టుకోలేక ఆ మూగజీవాలు ప్రాణాలు విడిచాయి. ఆపై ఆ దుర్మార్గాన్ని వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఇది గమనించిన సైబర్ పోలీసులు ఆ మైనర్లుపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఘటనపై వారిని ప్రశ్నించగా ఇదంతా కేవలం సరదా కోసం చేశామన్నారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.