తెలంగాణ కరువు జిల్లా పాలమూరుకు పట్టిన కరువును తరిమివేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మంచి ఊరట లభించింది. ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన కొందరు రైతులు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు అపెక్స్ కౌన్సిల్‌లో రెండు రాష్ట్రాలు మాట్లాడుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ సూచన ను సిఎం కేసీఆర్ స్వాగతించారు. సుప్రీం కోర్టు స్పందన వల్ల పాలమూరు, డిండి ప్రాజెక్టుల పురోగతికి ఇకపై అడ్డంకులు ఉండకపోవచ్చని సిఎం అభిప్రాయప్డారు. పాలమూరు ప్రాజెక్టుకు పట్టిన శని విరగడవుతుందని, శాశ్వతం గా అడ్డంకులు తొలగినట్లేనని వ్యాఖ్యానించారు.
వెంటనే ప్రాజెక్టు పనులు పూర్తిచేసి ప్రాజెక్టు ఫలితాలు ప్రజలకు అందిస్తామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఎపి అభ్యంతరాలకు పెద్దగా విలువలేనందున ప్రాజెక్టుల ను శరవేగంగా నిర్మించాలని నీటిపారుదల శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. అత్యంత కరువు పరిస్థితి ఉన్న మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల రైతులకు సాగునీరు అందించడం అత్యంత అవసరమని, పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలను సత్వరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.
నీటి పారుదల ప్రాజక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిబంధనల మేరకు వ్యవహరిస్తున్నప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరచూ అర్ధంపర్ధం లేని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ భంగపడుతున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తాజా స్పందనతోనైనా ఎపి ప్రభుత్వ వైఖరి మారాలని ఆకాంక్షించారు. సుప్రీం తీర్పు నల్లగొండ, పాలమూరు జిల్లాల ప్రజలకు గొప్ప ఊరట అని సిఎం అన్నారు. ఈ నేపధ్యంలో రాకెట్ వేగంతో పాలమూరు,డిండి ప్రాజక్టులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖను ఆదేశించారు.