ప్రతిష్ఠాత్మక మిస్టర్ వరల్డ్ టైటిల్ ను హైదరాబాదీ యువకుడు, ప్రముఖ మోడల్ రోహిత్ ఖండేల్వాల్ సొంతం చేసుకున్నాడు. మిస్టర్ వరల్డ్-2016 ఫైనల్ పోటీలకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 46 మంది పోటీదారులను పక్కకు తోసేసి ప్రపంచ విజేత అయ్యాడు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు రోహిత్ కావడం విశేషం. ఇంగ్లండ్ సౌత్ పోర్ట్ లో జరిగిన ఫైనల్స్ లో రోహిత్ మిస్టర్ వరల్డ్ టైటిల్ ను దక్కించుకున్నారు. బహుమతిగా 50వేల డాలర్ల (భారత కరెన్సీలో రూ.35లక్షలు) నగదు కూడా సొంతం చేసుకున్నారు.
రోహిత్ ఖండేల్‌వాల్ హైదరాబాద్‌లో 1989, ఆగస్టు 19న జన్మించారు. అరోరా డిగ్రీ కాలేజీలో చదివారు. మోడల్‌గా మారకముందు నగరంలోనే స్పైస్‌జెట్ గ్రౌండ్ స్టాఫ్‌గాను, డెల్ కంప్యూటర్స్ సంస్థలో సాంకేతిక సహాయకుడిగా పనిచేశారు. అనంతరం ముంబైలో ఎంబీఏ చదువుతుండగా మోడలింగ్‌లో అవకాశాలు వచ్చాయి. బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్‌తో కలిసి ఓ జుయెలరీ సంస్థ వాణిజ్య ప్రకటన చేశారు. దీంతో మోడలింగ్‌లో అతడి కెరీర్ రాకెట్‌లా దూసుకుపోయింది. బిందాస్ ఛానల్‌లో ప్రసారమయ్యే యే హై ఆషికి సీరియల్ లో నటించారు. వీ చానల్‌లో వచ్చే మిలియన్ డాలర్ సీరియల్‌లో చేనేత కార్మికుల సంఘం నేతగా నటించారు. మిస్టర్ ఇండియాగా 2015లో టైటిల్ సాధించాడు. అదే పోటీల్లో స్టే ఆన్ మిస్టర్ యాక్టివ్, ప్రొవోగ్ పర్సనల్ కేర్ బెస్ట్ యాక్టర్ టైటిళ్లు కూడా సొంతం చేసుకున్నారు. ప్రపంచ టైటిల్ దక్కిందంటే నమ్మలేకపోతున్నానని రోహిత్ తెలిపాడు. ఈ టైటిల్ సాధించిన మొదటి భారతీయుడు తానే కావడం చాలా ఆనందంగా, గర్వంగా ఉందన్నారు.