దిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ రాయబారులతో భేటీ అయ్యారు. విదేశీ రాయబారులు, ఇండస్ట్రీ, ఐటీ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. మలేషియా ఉపప్రధాని డాక్టర్ అహ్మద్ జహిద్ హమిదిని తెలంగాణకు రావాలని ఆహ్వానించారు. హార్డ్ వేర్ కంపెనీలకు తెలంగాణలో ఉన్న అవకాశాలపై జపాన్ డిప్యూటీ అంబాసిడర్ యుపక కికుటతో మంత్రి కేటీఆర్ చర్చించారు. మన దేశం వైపు చూస్తున్న జపాన్ కంపెనీలను మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ తెలంగాణలో భాగంగా పెట్టుబడులను ఆహ్వానించేందుకు త్వరలోనే జపాన్ లో పర్యటిస్తానని చెప్పారు. తెలంగాణకు పెట్టుబడులు వచ్చేందుకు సహకారం అందించాలని జపాన్ అంబాసిడర్ ను మంత్రి కేటీఆర్ కోరారు.
తెలంగాణలో డేటా సెంటర్ ఏర్పాటుకు సహకరించాలని భారతి ఎంటర్ ప్రైజెస్ (ఎయిర్ టెల్) చైర్మన్ సునీల్ మిట్టల్ తో మంత్రి కేటీఆర్ చర్చించారు. వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. డిజిటల్ అక్షరాస్యతను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. చిన్న,మధ్య తరగతి పారిశ్రామికవేత్తల సమస్యలను కేంద్రమంత్రి కల్రాజ్ మిశ్రాతో చర్చిస్తానని చెప్పారు. రెండు రోజుల పర్యటనలో కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని మంత్రి కేటీఆర్ చెప్పారు.