కొత్త జిల్లాలపై రిపోర్టులు సిద్ధం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్నట్లుగానే కొత్త జిల్లాల ఏర్పాటుకు కార్యాచరణ ప్రారంభమైంది. దసరా నాటికి కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించేశారు. అందులో భాగంగా  అన్ని శాఖల కార్యదర్శులతో భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలు, పోస్టులు, ఉద్యోగుల కుదింపు, అవసరమైన స్వరూపం తదితర అంశాలపై కార్యదర్శుల సమావేశంలో చర్చించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయిలో ఆయా శాఖల అవసరాలకు అనుగుణంగా నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు.

ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో కొత్తగా ఒకటి లేదా రెండు జిల్లా కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఈ తరుణంలో ఉద్యోగుల సర్దుబాటుకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. ఈ దిశగా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చారు. నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా పూర్తి స్థాయి కసరత్తు కూడా చేపట్టారు. జిల్లాల సంఖ్య పెంపు నేపథ్యంలో శాఖలు, విభాగాలు, ఉద్యోగులకు సంబంధించి హేతుబద్ధీకరణ చేపట్టాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. జిల్లా స్థాయిలో ఒకే రకమైన బాధ్యతలు ఒక ఉద్యోగే నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నారు. పంచాయతీ రాజ్, సంక్షేమ శాఖల్లో ఒకే రకమైన విధులను.. పలువురు నిర్వర్తిస్తోన్న నేపథ్యంలో కొన్ని పోస్టులను తగ్గించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.

1984లో మండలాల ఏర్పాటు తరహాలోనే కసరత్తు జరపాల్సి ఉంటుందని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. సమితిలను మండలాలుగా విభజించిన తరహాలోనే ప్రస్తుత ఒక జిల్లాను రెండు లేదా మూడుగా విభజించాల్సి ఉంటుందని అంటున్నారు. అదే తరహాలో ఉద్యోగులు, సిబ్బంది విభజన జరుగుతుందని అంచనా. పరిధి తగ్గుతున్నందున తక్కువ హోదా ఉన్న అధికారులకు కూడా బాధ్యతలు అప్పగించవచ్చని భావిస్తున్నారు. మండలాల ఏర్పాటు సమయంలో తహసీల్దార్లకు కొన్ని చోట్ల, ఉప తహసీల్దార్లకు కొన్ని చోట్ల బాధ్యతలు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. అవసరమైతే పదోన్నతులను తరువాత చేపట్టే అవకాశం ఉంది.

దసరా నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి రావాలంటే కనీసం 45 నుంచి 60 రోజుల ముందు ముసాయిదా నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు నెల రోజుల వ్యవధి తప్పనిసరి. వచ్చే నెల 10 లేదా 11 తేదీల్లో ఇందుకు సంబంధించిన ముసాయిదాను జారీ చేసే అవకాశాలున్నాయి. అంతకు ముందే రాష్ట్ర స్థాయిలో అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. కాగా పరిపాలనను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి అభివృద్దికి పునాదులు చెయ్యాలంటే మాత్రం జిల్లా విస్తీర్ణాన్ని తగ్గించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నాడు. కాబట్టే కొత్త జిల్లాలపై తెలంగాణ ప్రభుత్వం వేగంగా ముందుకు వెళుతోంది.