అమెరికాలో తెలంగాణ యువకుడి హత్య

అమెరికాలో మెదక్‌ జిల్లాకు చెందిన యువకుడు సోమవారం హత్యకు గురయ్యాడు. ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు అందనంత దూరానికి వెళ్లడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్‌కు చెందిన గుండం విజరుకుమార్‌-రమాదేవి హైదరాబాద్‌లో వైద్యశాఖలో ఉద్యోగం చేస్తున్నారు. సుల్తాన్‌బజార్‌ కుత్బీగూడలో నివాసముంటున్నారు. వారికి కూతురు, కొడుకు ఉన్నారు. కొడుకు సంకీర్త్‌ రెండున్నర ఏండ్ల కిందట ఉన్నత విద్య కోసం అమెరికాలోని టెక్సాస్‌కు వెళ్లాడు.

ఎంఎస్‌ పూర్తిచేసి ఇటీవల ఉద్యోగంలో చేరి ప్రణీత్‌ అనే యువకుడితో కలిసి ఉంటున్నాడు. అయితే 15 రోజుల కిందట అమెరికాకు వెళ్లిన హైదరాబాద్‌ నగరానికి చెందిన సాయిసందీప్‌గౌడ్‌ కూడా వారి గదిలోనే ఉంటున్నాడు. సోమవారం రాత్రి సంకీర్త్‌, సాయిసందీప్‌గౌడ్‌ మాట్లాడుకుంటుండగా, ప్రణీత్‌ నిద్ర వస్తుందంటూ గదిలోకి వెళ్లాడు. బయట సందీప్‌గౌడ్‌ సంకీర్త్‌ను కత్తితో పొడవడంతో, అరుపులు విని ప్రణీత్‌ బయటకు వచ్చాడు. రక్తపు మడుగులో పడిఉన్న సంకీర్త్‌ను చూసి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంకీర్త్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. సాయి సందీప్‌గౌడ్‌ను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు గత వారం ఓ పార్టీకి వెళ్లగా, అక్కడ సంకీర్త్‌, సందీప్‌ల మధ్య గొడవ జరిగిందని, ఈ క్రమంలోనే ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో కుటుంబసభ్యులకు అమెరికా నుంచి ఫోన్‌ చేసి సంకీర్త్‌కు ప్రమాదం జరిగిందని, కోమాలో ఉన్నాడని చెప్పారు. అయితే సంకీర్త్‌ హత్య విషయం టీవీల్లో రావడంతో కుటుంబసభ్యులకు తెలిసింది.