తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టాలన్న ఓ యువకుడి కల చెదిరింది. కానిస్టేబుల్ గా తిరిగి వస్తాడనుకున్న ఆ యువకుడి ఇంట్లో విషాదం నిండింది. నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్‌లో అపశృతి జరిగింది. ఈవెంట్స్‌లో పాల్గొన్న అభ్యర్థి పరిగెడుతూ కుప్పకూలాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడు. దాంతో మరోసారి పోలీస్ రిక్రూర్ మెంట్ లో పరుగుపందెంపై చర్చకు తెర లేచింది.
నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్ మండలం చెట్లముకుందాపురం గ్రామానికి చెందిన వాస రాజశేఖర్ కానిస్టేబుల్ ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు నల్గొండకు వచ్చాడు. 800 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నాడు. మరో ఐదు మీటర్ల దూరంలో లక్ష్యాన్ని చేరుకునే లోపు కుప్పకూలి పోయాడు. పోలీస్ సిబ్బంది వెంటనే అతన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. అతని తల్లిదండ్రులు వాస అంజయ్య, వెంకటమ్మ బండరాయి కొట్టి జీవనం సాగిస్తుంటారు. ఉద్యోగార్థం వెళ్లిన కొడుకు శవమై రావడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. మృతదేహాన్ని డీఎస్పీ సుధాకర్, సీఐ రవీందర్, ఎస్సై నాగదుర్గాప్రసాద్ సందర్శించారు.