తెలంగాణ భాజపా నేతలు ముఖ్యంగా ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మొదటి నుంచి కూడా తెదేపాతో పొత్తులని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. తెదేపాతో పొత్తుల కారణంగానే భాజపాని కూడా రాష్ట్ర ప్రజలు తిరస్కరిస్తున్నారని ఆయన అభిప్రాయం. కారణాలు ఏవైతేనేమి, ఇప్పుడు ఆ రెండు పార్టీలు దూరం అయ్యాయి కానీ ఇంకా విడిపోయినట్లు అధికారికంగా చాటింపు వేసుకోలేదు కానీ అందుకోసం జరుగవలసిన తంతు మొదలుపెట్టేశాయి.
మొదట తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బ్యాటింగ్ మొదలుపెడుతూ, “తెరాసకి భాజపా తోక పార్టీగా మారిపోయింది. ఫార్మ్ హౌస్ కే పరిమితమవుతూ ఏనాడూ సచివాలయం గడప తొక్కని ముఖ్యమంత్రి కెసిఆర్ కి కేంద్రప్రభుత్వం ఏమి చూసి నెంబర్ 1 ర్యాంక్ ఇచ్చిందో తెలియదు,” అని చిన్నగా విమర్శించారు.
తెదేపాని తీవ్రంగా వ్యతిరేకించే కిషన్ రెడ్డి టక్కున ఆయనకి చాలా ఘాటుగా బదులిచ్చారు. “తెలంగాణలో తెదేపా దుకాణం ఎప్పుడో బంద్ అయిపోయింది. ఇప్పుడు ఆ పార్టీ కనబడదు...దాని క్యాడర్ కనబడదు. ఇక లేని పార్టీ నేతకి ఏదో మాట్లాడితే దానికి మేము స్పందించాలా?” అని ప్రశ్నించారు.
తెలంగాణలో ఒకప్పుడు కాంగ్రెస్, తెరాస, తెదేపా, భాజపాలు చాలా బలంగా ఉండేవి. తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్ష పార్టీలనిన్నిటినీ ఒకటొకటిగా క్లీన్ చేసేసింది. భాజపాని కూడా క్లీన్ చేసేసేదే...కానీ కేంద్రంలో ఆ పార్టీయే అధికారంలో ఉంది కనుక దాని జోలికి వెళ్ళలేదనుకోవచ్చు. దానిని విడిచిపెట్టేసినప్పటికీ గత రెండేళ్లలో జరిగిన అన్ని ఎన్నికలలో వరుసగా తెరాస చేతిలో ఓడిపోతున్న కారణంగా భాజపా కూడా పూర్తిగా డీలా పడిపోయింది.
కనుక భాజపా సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకొనేందుకు చాలా శ్రమ పడుతున్నాయి. విచిత్రం ఏమిటంటే ఒకవైపు తమ ఉనికి కాపాడుకోవడం కోసం పోరాడుతూనే మళ్ళీ వాటిలో అవే రెండవ స్థానం కోసం కూడా పోరాడుకొంటున్నాయి. మూడు పార్టీలు కూడా తెరాసకి తామే ఏకైక ప్రత్యామ్నాయం అని గట్టిగా నమ్ముతున్నాయి. అందుకే రెండవ స్థానం కోసం వాటిలో అవి కీచులాడుకొంటున్నాయి.
తెదేపా, భాజపాలు దూరం అయినందున, ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య కూడా రెండవ స్థానం కోసం పోటీ నడుస్తున్నట్లుంది. ఇటువంటి దుస్థితిలో ఉన్న అవి తెరాసకి తామే ప్రత్యామ్నాయం అని ఏ విధంగా భావిస్తున్నాయో తెలియదు. వచ్చే ఎన్నికల నాటికి వాటిలో ఎన్ని మిగిలి ఉంటాయో, మిగిలినవి తెరాసని ఏ విధంగా ఓడిస్తాయో చూడాల్సిందే తప్ప వర్ణించడం సాధ్యం కాదు.