మిషన్ కాకతీయకి కేంద్రం ప్రశంసలు

తెలంగాణ మీదుగానే కృష్ణా, గోదావరి నదులు దిగువకి పారుతున్నప్పటికీ దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యం వలన వ్యవసాయం దైవాధీనంగా మిగిలిపోయింది. సకాలంలో వర్షాలు కురిస్తే పంటలు లేకుంటే పొలాలన్నీ ఎండిన బీళ్ళు అన్నట్లుగా సాగుతుండేది. తెలంగాణ రైతుల కష్టాలు, నీటివనరుల గురించి మంచి అవగాహన, ప్రత్యేకాసక్తి ఉన్న కెసిఆర్ వంటి వ్యక్తి కాకుండా మరేవరయినా ముఖ్యమంత్రి అయ్యుంటే, తెలంగాణా ఏర్పడినప్పటికీ రాష్ట్రంలో రైతులు, వ్యవసాయ పరిస్థితులలో బహుశః ఎటువంటి మార్పు వచ్చి ఉండేది కాదేమో? కానీ రైతుల అదృష్టవశాత్తు వారి కష్టనష్టాలు, సాధక బాధకాలు క్షుణ్ణంగా తెలిసిన కెసిఆర్ తెలంగాణా ముఖ్యమంత్రి అయ్యారు.

ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రాష్ట్రంలో చిరకాలంగా నిర్లక్ష్యానికి గురైన చెరువుల పూడికతీత కార్యక్రమాన్ని మిషన్ కాకతీయ పేరుతో ప్రారంభించారు. దానితో సమాంతరంగా నీటి ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టారు. రాష్ట్రానికి శాపంగా మారిన విద్యుత్ కొరత సమస్యని కూడా పరిష్కరించేందుకు నడుం బిగించారు. ఈ మూడు కార్యక్రమాల ద్వారా ప్రధానంగా మేలు జరిగేది రైతులకేనని చెప్పవచ్చు.

నేటికీ సాగునీటి సౌకర్యం లేనందున తెలంగాణలో చాలా మంది రైతులు బోర్లపైనే సాగు చేస్తున్నారు. వాటికి నిరంతర విద్యుత్ అందించడం ద్వారా నీళ్ళని అందుబాటులోకి తీసుకువచ్చారు. అదే సమయంలో పల్లెపల్లెన కనబడే చెరువుల పూడిక తీయించడం వలన వర్షపు నీటిని వాటిల్లో నిలువచేసి అదనంగా నీళ్ళు అందుబాటులోకి తేగలిగారు. అంతే కాకుండా, ఆ చెరువుల పరిసర ప్రాంతాలలో భూమిలోని నీటి మట్టాలు గణనీయంగా పెరిగాయి. ఆ కారణంగా ఎండిన బోర్లలోకి కూడా మళ్ళీ నీరు చేరుతుండటంతో రైతుల మొహాలలో చిరునవ్వులు కనబడుతున్నాయి.

ఇక కెసిఆర్ ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తయినట్లయితే తెలంగాణ ముఖచిత్రమే పూర్తిగా మారిపోతుంది. కానీ అందుకు చాలా సమయం పడుతుంది. కానీ ఈలోగా ఈ రెండు పద్ధతులలో రైతుల నీటి సమస్యలు తీరుతుంటాయి.

మిషన్ కాకతీయ పనుల గురించి, వాటి ఫలితాల గురించి ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా చర్చ జరుగుతోంది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతిని ముఖ్యమంత్రి కెసిఆర్ కలుసుకొన్నప్పుడు ఆమె కూడా ఆ పధకాన్ని, అటువంటి ఆలోచన చేసినందుకు కెసిఆర్ ని చాలా మెచ్చుకొన్నారు. ఆ పధకం వివరాలు తనకి అందజేస్తే, మిగిలిన రాష్ట్రాలలో కూడా ఆ పధకాన్ని అమలుచేయిస్తామని చెప్పారు. ఒక మంచి పథకం ప్రవేశపెట్టడమే కాకుండా దానిని చివరి వరకు అంతే చిత్తశుద్ధితో నిర్వహించడం మామూలు విషయమేమీ కాదు. అందుకే కెసిఆర్ కి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.