
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి, వైసీపీ అధినేతలు చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ పోటాపోటీగా అభ్యర్ధుల పేర్లను ఖరారు చేస్తున్నారు. గత వారం రోజులుగా నియోజకవర్గాల వారీగా అభ్యర్ధులతో సమీక్షాసమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబునాయుడు గురువారం జిల్లాలోని రాజంపేట (చెంగల్రాయుడు), మైదుకూరు (సుధాకర్ యాదవ్), కమలాపురం (పుత్తా నరసింహారెడ్డి), రైల్వేకోడూరు (ఎంపీ శివప్రసాద్ అల్లుడు నరసింహప్రసాద్), చిత్తూరు జిల్లాలోని పీలేరు (మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి), పుంగనూరు (మంత్రి అమరనాథరెడ్డి మరదలు అనీషారెడ్డి)ల పేర్లను ఖరారు చేశారు. చిత్తూరులోని తంబళ్ళపల్లి, మదనపల్లి నియోజకవర్గాల టికెట్లకు గట్టి పోటీ ఉన్నందున వాటిని పెండింగులో పెట్టారు. మార్చి మొదటివారంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నందున వీలైనంత త్వరగా మిగిలిన అభ్యర్ధుల పేర్లను ఖరారు చేయవచ్చు. శాసనసభ అభ్యర్ధులతో పాటు లోక్‌సభ అభ్యర్ధుల ఎంపికపై కూడా కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే వారి పేర్లు కూడా ఖరారు చేయబోతున్నారు.