ఓట్-ఆన్‌-బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం

ఈరోజు సాయంత్రం ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఓట్-ఆన్‌-బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్ధికశాఖను ఎవరికీ కేటాయించకుండా సిఎం కేసీఆర్‌ తన వద్దే అట్టేపెట్టుకొన్నందున ఈసారి ఆయనే స్వయంగా శాసనసభలో ఓట్-ఆన్‌-బడ్జెట్‌ ప్రవేశపెడతారు. వైద్య, ఆరోగ్యశాఖామంత్రి ఈటల రాజేందర్‌ శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. రేపు ఉదయం 11.30 గంటలకు ఒకేసారి ఇరువురూ ఉభయసభలలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 

ఇది తాత్కాలిక బడ్జెట్‌ అయినప్పటికీ, బడ్జెట్ విలువ రూ.2 లక్షల కోట్లు లేదా మరికాస్త ఎక్కువే ఉండవచ్చునని సమాచారం. పింఛను సొమ్ము పెంపు, పంటరుణాల మాఫీ తదితర ఎన్నికల హామీలను అమలుచేసేందుకు వీలుగా రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లు సమాచారం. నేటి వరకు రాష్ట్రంలో నిరుద్యోగుల డాటా సేకరణ కార్యక్రమం పూర్తికానందున బడ్జెట్‌లో నిరుద్యోగభృతి హామీ అమలుకు నిధులు కేటాయించారో లేదో తెలియవలసి ఉంది.

పంచాయతీ ఎన్నికలలో అన్ని వర్గాలకు కలిపి 50 శాతం రిజర్వేషన్లకు పరిమితం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సుకు చట్టరూపం కల్పించవలసి ఉంది. అదేవిధంగా జీఎస్టి చట్ట సవరణకు గతంలో జారీ చేసిన ఆర్డినెన్సుకు చట్టబద్దత కల్పించవలసి ఉంది కనుక వాటి కొరకు రెండు వేర్వేరు బిల్లులు రేపు ఉభయసభలలో ప్రవేశపెట్టనున్నారు.       కనుక దానికి సంబందించిన బిల్లును రేపు ఉభయసభలలో ప్రవేశపెట్టవచ్చు.