దేశరాజధాని దిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి ఫుల్ బిజీగా గడిపారు. ప్రధాని నరేంద్ర మోదీని కలవడంతో పాటు, పలువురు కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ సంబంధిత అంశాలపై వారితో చర్చించారు. చాలాకాలం తర్వాత కేసీఆర్ దిల్లీలో మకాం వేసి కేంద్రం పెద్దలను కలిశారు. విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. బయ్యారం ఉక్కు నుంచి కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా పరిశీలన దాకా చట్టంలో పేర్కొన్నా అడుగు కూడా ముందుకు పడలేదు. అసలు హైకోర్టు విభజనే ఇంతవరకూ చేయలేదు. మరి ఇప్పుడు మాత్రం కెసిఆర్ వెళ్లి అడిగితే అన్నీ ఇచ్చేస్తారా? అని కొంత మంది పెదవి విరుస్తున్నారు.
ఏపిలో తమ మిత్రపక్షమైన టిడిపినే అధికారంలో ఉన్నా కూడా రిక్తహస్తం చూపిస్తున్నారు దిల్లీ పెద్దలు. అలాంటిది తెలంగాణకు ప్యాకేజీలు ప్రకటిస్తారా? పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. అయినా ఏడాదికి వంద కోట్లు మించి రాల్చడం లేదు. అది ఎప్పటికి పూర్తి అవుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. అలాంటిది కాళేశ్వరానికి జాతీయ హోదా ఇస్తారా? ఇచ్చినా అదే వంద కోట్లు చొప్పున ఎంతకాలమిస్తారు? వాస్తవానికి సంస్కరణల పథంలో వెళుతున్న మోడీ ప్రభుత్వ నేతృత్వంలో చేపట్టే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడం అంత సులభం కాదు.
అయితే కేసీఆర్ కేంద్రంపై ఎంతోకొంత ఆధారపడక తప్పని పరిస్థితి. బడ్జెట్‌లో మిగులు రాష్ట్రం, ఆదాయంలో ధనిక ప్రాంతం అయినా కూడా కెసిఆర్ చేపట్టిన పథకాలకు వీసమంతా సరిపోవు. సాగునీటి ప్రాజెక్టులు, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, విద్యుత్ ప్రాజెక్టులు ఇలా చెప్పుకుంటే పోతే బడ్జెట్‌లో నిధులు గురించి ప్రస్తావించని లక్షల కోట్ల పథకాలు పూర్తి చేయాల్సి ఉంది. కేంద్ర సాయం లేకుండా అంత సులభంగా ఈ పథకాలు గట్టెక్కలేవు. అందుకే కెసిఆర్ తప్పక ఢిల్లీ గడప ఎక్కుతున్నారు. ఢిల్లీపై నమ్మకం పెట్టుకోవడం అత్యాశే అని తెలిసినా కూడా అవసరం ఉంది కాబట్టి ఎంతొచ్చినా అక్కరకు వస్తుందని భావిస్తున్నారు. కేంద్రం పెద్దలు కూడా అందరు ముఖ్యమంత్రులకు చెప్పినట్టుగానే మేం చూసుకుంటాం, మీ పథకాలు భాగున్నాయంటూ అభయమిస్తున్నారు. అది కేవలం అభయమే.. ఆచరణలో అనుమానమే? ఎందుకంటే గతంలో మిషన్ కాకతీయను అధ్బుతంగా అభివర్ణించిన కేంద్రం ఆర్ధికసాయం చేస్తామంది.. కానీ ఒక్క పైసా రాలేదు. మరి చూడాలి ఈసారి కేసీఆర్ పర్యటన ఎలాంటి ప్రయోజనాలను కలిగిస్తుందో.