లోక్‌సభ ఎన్నికలకు కేసీఆర్‌ కసరత్తు

త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం తెలంగాణ సిఎం కేసీఆర్‌ కూడా కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ మినహా మిగిలిన 16 నియోజకవర్గాలలో తెరాస పోటీ చేయబోతోంది కనుక వాటి పరిధిలో గల 112 అసెంబ్లీ నియోజకవర్గాలలో 60 బహిరంగసభలు నిర్వహించాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు తాజా సమాచారం. లోక్‌సభ ఎన్నికల బాధ్యతను ఆయా జిల్లాలో తెరాస ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా సమానంగా బాధ్యతలు అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. మార్చి మొదటివారంలో సిఎం కేసీఆర్‌ అధ్వర్యంలో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేస్తారు. దాని పర్యవేక్షణలో జిల్లా, మండల గ్రామస్థాయి కమిటీలు పనిచేస్తాయి. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాలంటే  ముందుగా లోక్‌సభ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేయవలసి ఉంటుంది కనుక త్వరలోనే అభ్యర్ధులను ఖరారు చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ నెలాఖరులోగా అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తామని చెప్పింది. కనుక సిఎం కేసీఆర్‌ కూడా ఇక ఆలస్యం చేయకపోవచ్చు.