"ఐసిస్ ఉగ్రవాదాన్ని నేను చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తాను. వారి వల్ల ఇస్లాం మతానికి చాలా చెడ్డ పేరు వస్తోంది. ముస్లిం యువకులు ఉగ్రవాదం పట్ల ఆకర్షితులు అవడం కంటే తమ ఉజ్వల భవిష్యత్, తమ కుటుంబాలపై దృష్టిపెడితే చాలా మంచిది. మనమందరం రాజ్యాంగానికి కట్టుబడి జీవించాలి. అదే రాజ్యాంగం మన హక్కులని కాపాడుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తోంది కనుక ప్రతీ ఒక్కరికీ న్యాయం కోసం పోరాడే హక్కు కూడా ఉంది. హైదరాబాద్ లో పట్టుబడ్డ ఐసిస్ సానుభూతిపరులకి కూడా ఆ హక్కు ఉంటుంది. వారికి మనం న్యాయ సహాయం అందించకపోతే ప్రభుత్వమే అందిస్తుంది, కనుక మేము వారికి న్యాయసహాయం అందించాలనుకొంటున్నాము,” అని అన్నారు మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. శుక్రవారం రాత్రి మహబూబ్ నగర్ లో ఐసిస్ వ్యతిరేక సభలో పాల్గొన్న ముస్లిం ప్రజలని ఉద్దేశ్యించి చెప్పారీ మాటలు.
ఐసిస్ ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నామని చెపుతూ, దాని కోసం ఈ విధంగా సభలు సమావేశాలు నిర్వహిస్తూనే మళ్ళీ హైదరాబాద్ పై భయంకరమైన దాడులు చేయడానికి సన్నద్ధమైన ఐసిస్ ఉగ్రవాదులకి న్యాయసహాయం చేస్తామని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. అసలు అటువంటి వారికి న్యాయసహాయం చేయాలనే ఆలోచనే తప్పు. పైగా తాము చేయకపోతే ప్రభుత్వం చేస్తుందని, కాబట్టే తాము చేయాలనుకుంటున్నామంటూ సమర్ధించుకోవడం ఇంకా తప్పు. వారికి ప్రభుత్వం న్యాయసహాయం చేస్తుందని అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా చెపుతున్నప్పుడు, మళ్ళీ మజ్లీస్ పార్టీ వారికి ఎందుకు న్యాయసహాయం చేయాలనుకొంటోంది? ప్రభుత్వంపై నమ్మకం లేకనా? లేకపోతే ఐసిస్ ఉగ్రవదులకి మంచి సమర్ధులైన న్యాయవాదులని ఏర్పాటు చేసి ఏదోవిధంగా వారిని విడిపించాలనే ఉద్దేశ్యంతోనా? అనే సందేహం కలుగుతోంది.
అసలు వారికి న్యాయసహాయం చేయడానికి మజ్లీస్ పార్టీకి ఎవరు నిధులు అందిస్తున్నారు? ఐసిస్ ఉగ్రవాదులకి న్యాయసహాయం చేయాలని మజ్లీస్ పార్టీ ఎందుకు తహతహలాడుతోంది? అని భాజపా నేతలు ప్రశ్నిస్తున్నారు. వారి ప్రశ్నలకి అసదుద్దీన్ ఒవైసీ నేరుగా సమాధానం చెప్పకపోవచ్చు. కానీ దేశంలో, రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ ముస్లింలు ఈ విధంగా వేధింపులకి గురవుతూనే ఉంటారని, వారిని మజ్లీస్ పార్టీ మాత్రమే అండగా ఉంటుందని చాటింపు వేసుకొని, ముస్లిం ప్రజలలో అభద్రతా భావాన్ని పెంచి పోషిస్తూ వారిని తమ పార్టీకి కట్టిపడేసుకోవాలనే దురాలోచనతోనే అసదుద్దీన్ ఈ విధంగా మాట్లాడుతున్నట్లున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆయన తన రాజకీయ లబ్ది కోసం ఇటువంటి ఆలోచనలు చేయడం, మాటలు మాట్లాడటం చాలా శోచనీయం. పాతబస్తీలో పట్టుబడ్డ ఉగ్రవాదులు అసదుద్దీన్ ఒవైసీ నివసిస్తున్న హైదరాబాద్ లోనే బాంబులతో విధ్వంసం సృష్టించాలని కుట్ర పన్నినట్లు స్పష్టంగా కనబడుతున్నా, ఆయన వారిని నిర్దోషులుగా నిరూపించాలని తహతహలాడటం చూస్తుంటే, ఆయనకి హైదరాబాద్ లో ప్రజల ప్రాణాలు, రాష్ట్రం, దేశం కంటే తన రాజకీయ లబ్దే ముఖ్యమని భావిస్తున్నారనుకోవలసి ఉంటుంది. రాజకీయ లబ్ది కోసం ఉగ్రవాదులకి, వేర్పాటువాదులకి మద్దతు ఇస్తే చివరికి ఏమవుతుందో ఆలోచించడం లేదు.