దటీజ్ కేసీఆర్‌

రాష్ట్రంలో కొత్త పంచాయతీలు..వాటికి కొత్త పాలకమండళ్ళు ఏర్పాతు చేసి సిఎం కేసీఆర్‌ చేతులు దులుపుకోలేదు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు గ్రామపాలన, పంచాయతీరాజ్ చట్టాలు, బాధ్యతలు, హక్కులు, అధికారాలు మొదలైన ప్రతీ అంశంలో శిక్షణ ఇచ్చి గ్రామాలను కూడా పట్టణాలతో పోటీ పదేవిధంగా అభివృద్ధి చేయాలని భావించారు. వారికి శిక్షణ ఇచ్చేందుకు రెవెన్యూ, వ్యవసాయ శాఖలలో అధికారులను (రిసోర్స్ పర్సన్స్) ఎంపిక చేసి వారితో నేడు ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారందరూ కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు ఏవిధంగా శిక్షణ ఇవ్వాలి? వారిద్వారా ఎటువంటి ఫలితాలు రాబట్టాలి? మొదలైన అంశాలపై సిఎం కేసీఆర్‌ పలు సూచనలు చేశారు. 

రిసోర్స్ పర్సన్స్ తో జరిగిన సమావేశంలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులను అందించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది. గ్రామాలలో మౌలికవసతుల కల్పన పనులను ప్రభుత్వమే చూసుకొంటోంది కనుక గ్రామాలలో పరిశుభ్రత, పచ్చదనం పెంచేవిధంగా పంచాయతీలను ప్రోత్సహించాలి. అలాగే ప్రతీ ఊరుకి ఒక శ్మశానవాటికను కూడా ఏర్పాటు చేసుకొనేందుకు తోడ్పడాలి. పంచాయతీల హక్కులు, అధికారాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు కానీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నా, నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నా,  గ్రామాభివృద్ధికి కృషి చేయకపోయినా అటువంటివారిపై కటినమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడదనే విషయం తెలియజేయాలి.

 

ప్రజలకు సేవ చేయడానికి, తమగ్రామాలు అభివృద్ధి చేసుకోవడానికే అధికారం లభించిందనే విషయం అందరూ సదా గుర్తుంచుకొని పనిచేయాలి తప్ప అధికారదర్పం ప్రదర్శించడం సరికాదు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాలు, దేశం కూడా అభివృద్ధి చెందుతాయని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి. కనుక అందరూ చిత్తశుద్ధితో పనిచేయడం చాలా అవసరం,” అని చెప్పారు.