తెలంగాణ రైతులకు శుభవార్త!

తెలంగాణ రైతులకు ఓ శుభవార్త! రైతుబంధు పధకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఎకరాకు రూ.10,000 ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. దానితో పాటు తెలంగాణ రైతులు అదనంగా మరో రూ.6,000 అందుకోబోతున్నారు.  

కేంద్రప్రభుత్వం ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో ‘ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌’ అనే కొత్త పధకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా 5 ఎకరాల వరకు పొలం కలిగిన రైతులందరికీ ఏడాదికి రూ.6,000 చొప్పున ఆర్ధిక సహాయం అందజేస్తామని తాత్కాలిక ఆర్ధికమంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దానిని మూడు వాయిదాలలో రూ.2,000 చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాలలో జమా చేస్తామని తెలిపారు.

కేంద్రప్రభుత్వం ఈ పధకం ప్రకటించిన వెంటనే సిఎం కేసీఆర్‌ సంబందిత శాఖల ఉన్నతాధికారులతో, పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యి దానిపై చర్చించారు. ఆ పధకం ద్వారా కేంద్రం ఇవ్వబోతున్న నిధులతో రైతుబంధు పధకం ఆర్ధికభారాన్ని తగ్గించుకొనే అవకాశం ఉన్నప్పటికీ, కేంద్రప్రభుత్వం ఇవ్వబోతున్న నిధులను యధాతధంగా రైతులకు అందజేయాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు. కనుక ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలోని రైతులకు రైతుబంధు పధకం కింద ఏడాదికి రూ. 10,000తో పాటు ‘ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌’ పధకం కింద మరో రూ.6,000 కలిపి మొత్తం రూ.16,000 అందుకోబోతున్నారన్న మాట! 

తెలంగాణ రైతుసమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ విషయాన్ని దృవీకరించారు. రైతులకు గరిష్టంగా లభ్ది కలగడం కోసం రెండు పధకాలను కలపకుండా వేర్వేరుగా యధాతధంగా అమలుచేయాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. కేంద్రప్రభుత్వం పధకం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఒక్కో వాయిదాకు సుమారు రూ. 950 కోట్లు చొప్పున మూడు వాయిదాలలో కలిపి ఏడాదికి 2,850 కోట్లు రావచ్చునని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారని దానిని యధాతధంగా రైతులకు అందజేయాలని సిఎం కేసీఆర్‌ భావిస్తునానట్లు గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. కనుక దేశంలో తెలంగాణ రైతులే అత్యధికంగా లబ్ధిపొందుతున్నవారుగా నిలుస్తారు.