హోమాలు చేసుకోవడానికా గెలిపించింది? విజయశాంతి



తెలంగాణ కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి, కో-ఛైర్మన్ డికె అరుణతో కలిసి ఈరోజు హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, సిఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. విజయశాంతి మాట్లాడుతూ, “ఎన్నికలప్పుడు మమ్మల్నే గెలిపించమని ప్రజలను ప్రాధేయపడిన కేసీఆర్‌, గెలిపించిన తరువాత తన ఫాంహౌసులో కూర్చొని హోమాలు చేసుకొంటున్నారు. హోమాలు చేసుకోవడానికా గెలిపించింది?రెండు నెలలు అవుతున్న మంత్రివర్గమే ఏర్పాటు చేయలేదు. పరిపాలన ఇంకా మొదలుపెట్టలేదు. ఇక ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలుచేస్తారో ఎవరికీ తెలియదు. దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన తెరాస ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలలో కూడా 16 సీట్లు గెలుచుకొంటామని ప్రజలకు నమ్మబలుకుతున్నారు. నిజానికి లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్‌-బిజెపిలకు రాహుల్ గాంధీ-నరేంద్రమోడీల మద్య జరిగే ఎన్నికలు. వాటిలో తెరాస గెలిస్తే కేంద్రం మెదలువంచి రాష్ట్రానికి రావలసినవన్నీ సాధించుకొస్తామని కేసీఆర్‌ చెపుతున్నారు. కానీ నిత్యం ప్రధాని నరేంద్రమోడీకి వంతపాడుతున్న కేసీఆర్‌ ఏవిధంగా సాధించగలరు? ఆ అవకాశం ఉన్నట్లయితే గత నాలుగున్నరేళ్ళలో ఎందుకు సాధించలేకపోయారు? సిఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజలను మళ్ళీ మరోసారి మభ్యపెట్టి లోక్‌సభ ఎన్నికలలో కూడా గెలవాలని చూస్తున్నారు. కనుక ప్రజలందరూ ఆయన మాయమాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని కోరుతున్నాను. కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మన్నించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవలసిన అవసరం ఉంది. కనుక లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆమె రుణం తీర్చుకోవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అన్నారు. 

డికె అరుణ కూడా ఇంచుమించు ఇదేవిధంగా చెప్పారు. లోక్‌సభ ఎన్నికల యుద్ధం రాహుల్ గాంధీకి-నరేంద్రమోడీకి మద్య జరుగుతున్నవని కానీ మద్యలో దూరుతున్న సిఎం కేసీఆర్‌ పైకి మోడీని వ్యతిరేకిస్తున్నట్లు నటిస్తూ ఎన్నికల తరువాత మోడీకి మద్దతు ఇచ్చేందుకే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నారాణి డికె అరుణ అనుమానం వ్యక్తం చేశారు. కనుక లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.