మొన్న హరీష్...నేడు కవిత!

తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు రెండు రోజుల క్రితం హటాత్తుగా ఆర్టీసీ గుర్తింపు సంఘం గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం, విద్యుత్ కార్మిక సంఘం,      అంగన్‌వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ అసోసియేషన్, గుర్తింపు పొందిన పాఠశాల యాజమాన్యాల సంఘాలకు గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న తెరాస ఎంపీ కవిత కూడా ఇవాళ్ళ అన్ని పదవులకు రాజీనామాలు చేయడం విశేషం. 

కార్మికుల సేవ చేయడం తనకు చాలా సంతృప్తి కలిగిస్తోందని కానీ రాజకీయ వ్యవహారాలతో తీరిక లభించకపోవడంతో వారికి పూర్తి న్యాయం చేయలేకపోతున్నానని, కనుక కార్మిక సంఘాల బాధ్యతల నుంచి తప్పుకొంటున్నానని ఆమె తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కానీ రాజీనామా చేసినంత మాత్రన్న కార్మిక సంఘాలకు తాను దూరం అయినట్లు భావించవద్దని, వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పూర్తి సహాయసహకారాలు అందిస్తానని కవిత తన లేఖలో పేర్కొన్నారు. 

రెండు రోజుల వ్యవదిలో హరీష్ రావు, కవిత తమ పదవులకు రాజీనామాలు చేయడం చూస్తే సిఎం కేసీఆర్‌ వారిరువురికి ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు ఏవో అప్పగించి, కార్మిక సంఘాల బాధ్యతలను తెరాసలో వేరే వారికి అప్పగించాలని యోచిస్తున్నారేమోననే సందేహం కలుగుతోంది. ఇంచుమించు ఒకేసారి వారిరువురు తమ పదవులకు రాజీనామా చేయడం వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి. అదేదో అతి త్వరలోనే స్పష్టం అవుతుంది.