
త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలకు బిజెపి సన్నాహాలు మొదలుపెట్టింది. దానిలో భాగంగానే మోడీ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా నిన్న లోక్‌సభలో అత్యంత ప్రజాకర్షక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు, బిజెపి అగ్రనేతలు ఇప్పటికే పలు రాష్ట్రాలలో పర్యటించి పార్టీ శ్రేణులను ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్దం చేస్తున్నారు. తెలంగాణ బిజెపి శ్రేణులను కూడ సిద్దం చేసేందుకు ఈనెల 5న, కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ, 18న అమిత్ షా రాష్ట్రంలో పర్యటించబోతున్నారు.
ఈనెల 5న హైదరాబాద్, సికిందరాబాద్, మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గాలలో ముఖ్యనేతలతో నితిన్ గడ్కారీ సమావేశం కానున్నారు. ఆ సమావేశంలో లోక్‌సభకుపోటీ చేయాలనుకొంటున్న అభ్యర్ధుల జాబితాను సిద్దం చేయవచ్చునని తెలుస్తోంది.
గడ్కారీ తరువాత అమిత్ షా కూడా అదేపని మీద ఫిబ్రవరి 18న నిజామాబాద్‌కు రాబోతున్నారు. ఆరోజున జరిగే పార్టీ క్లస్టర్ సమావేశంలో నిజామాబాద్, జహీరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, జిల్లాల పార్లమెంటు నియోజకవర్గాలలోని ముఖ్య నేతలతో, జిల్లా ఇంఛార్జ్ లతో సమావేశమవుతారు. గడ్కారీ, అమిత్ షాల సమావేశాల తరువాత ఎప్పుడైనా బిజెపి లోక్‌సభ అభ్యర్ధుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.