
నాలుగు రోజుల క్రితమే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కుషీనగర్ సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ యుద్దవిమానం కుప్పకూలింది. ఈరోజు బెంగళూరు సమీపంలో మిరేజ్ 2000 యుద్ధ శిక్షణా విమానం కూలింది. రోజువారీ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం బెంగళూరు విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ మరణించగా, విమానంలో ఉన్న మరో ఇద్దరు స్వల్పగాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. విమానం బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలోనే కూలిపోవడంతో ప్రమాదం సంగతి తెలియగానే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను ఆర్పారు. ప్రమాదంలో గాయపడిన ఇద్దరినీ సహాయ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఈ విమానాన్ని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది.