
నాంపల్లి ఎగ్జిబిషన్‌లో నిన్న రాత్రి అగ్నిప్రమాదం జరిగి భారీగా ఆస్తినష్టం జరుగడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీకి అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్ ఈరోజు ఘటనాస్థలంలో పర్యటించి పరిశీలించి, పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఇక్కడ గత 79 ఏళ్ళ నుంచి ప్రతీ ఏటా ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు కానీ ఎప్పుడూ ఈవిధంగా ప్రమాదం జరుగలేదు. ఈ ప్రమాదంలో సుమారు 300 దుఖాణాలు కాళీ బూడిదైపోయాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తులో తెలుస్తాయి. కనుక దీనిపై ఎవరూ రాజకీయాలు చేయవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రమాదానికి కారణాలు ఏవైనా, ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకున్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. వారందరూ మా కుటుంబ సభ్యులవంటివారే కనుక వారిని తప్పకుండా ఆదుకొంటాము. మళ్ళీ ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా స్టాల్స్ నిర్మిస్తాము. ప్రతీ స్టాల్ కు నీళ్ళ మోటర్లను అమరుస్తాము,” అని చెప్పారు.
కేవలం కొన్ని వందలమంది వచ్చిపోయే సినిమా హాళ్ళు, షాపింగ్ మాల్స్ కు అగ్నిప్రమాదాలను నివారించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తే గానీ అగ్నిమాపక శాఖ అనుమతులీయదు. కానీ రోజుకు సుమారు లక్షమంది సందర్శకులు వచ్చే నాంపల్లి ఎగ్జిబిషన్‌లో అగ్నిమాపకశాఖ ఎటువంటి ముందస్తు జాగ్రత్తచర్యలు తీసుకోకపోవడం వలననే ఇంత భారీ అగ్నిప్రమాదం జరిగిందని స్పష్టం అవుతోంది. కనుక ఇది ఖచ్చితంగా అగ్నిమాపకశాఖ, ఎగ్జిబిషన్ సొసైటీల వైఫల్యమే. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఇటువంటి ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకొంటామని చెప్పడం చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడమే.