నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారీ అగ్నిప్రమాదం

కొద్దిసేపటి క్రితం (బుధవారం రాత్రి సుమారు 7.30 గంటలకు) నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆంధ్రాబ్యాంక్ ఏర్పాటు చేసిన స్టాల్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో చుట్టుపక్కల దుఖానాలకు వ్యాపించాయి. ప్రజలు భయంతో బయటకు పరుగులు తీయడంతో కొద్దిసేపు త్రొక్కిసలాట జరిగినట్లు సమాచారం. ప్రమాదం సంగతి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకొని మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకేసారి ఐదు అగ్నిమాపకయంత్రాలు 30 మందికి పైగా సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియవలసి ఉంది. ఎగ్జిబిషన్ లో కొన్ని స్టాల్స్ ఒకదానిని ఆనుకొని మరొకటి ఉంటాయి కనుక ఈ ప్రమాదంలో భారీగానే ఆస్తినష్టం జరిగే అవకాశం ఉంది.