అమరావతి శంఖుస్థాపన తరువాత రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రుల మధ్య కనబడిన సఖ్యత, ఆ తరువాత మళ్ళీ క్రమంగా పలుచబడటం మొదలయింది. షెడ్యూల్: 9,10 సంస్థల ఆస్తుల పంపకాలు, కృష్ణా గోదావరి నీళ్ళ పంపకాలు, వాటిపై తెలంగాణా ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టులని వ్యతిరేకిస్తూ కర్నూలులో జగన్ దీక్ష చేయడం, హైకోర్టు విభజన, న్యాయమూర్తుల నియామకంలో వివక్ష వంటి అనేక కారణాలతో రెండు ప్రభుత్వాల మధ్య ఆ దూరం పెరుగుతూనే ఉంది.
నేడు ఢిల్లీ లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన అంతర్రాష్ట్ర మండలి సమావేశం జరుగబోతోంది. ఆ సమావేశంలో దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు. కానీ ఈ సమావేశంలో ఫూంచి కమిషన్ సిఫార్సుల ఆమోదం, ఆధార్ కార్డువిధానంలో మార్పులు చేర్పులపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకోవడం, నగదు బదిలీ పథకం, విద్యా ప్రమాణాలు పెంచడం, అంతర్గత భద్రత అంశాలపై మాత్రమే చర్చించబోతున్నారు. కనుక ఏపి తెలంగాణాల మధ్య నెలకొని ఉన్న అనేక సమస్యలపై ఆ సమావేశంలో చర్చ జరిగే అవకాశం లేదు.
అంతర్రాష్ట్రాల మండలి సమావేశంలో రాష్ట్రాల మధ్య నెలకొని ఉన్న ఇటువంటి సమస్యలని పరిష్కరించకుండా, కేంద్ర ప్రభుత్వం తనకి నచ్చిన, దానికి ప్రాధాన్యత గల అంశాలపై మాత్రమే చర్చించడం వలన ఈ సమావేశం నిర్వహించి ప్రయోజనం ఉండదు. ఒకవేళ ఇటువంటి సమావేశాలలో సాధ్యం కాదనుకొంటే అంతర్రాష్ట్ర సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులని వేర్వేరుగా అయినా ప్రధాని స్వయంగా సమావేశ పరిచి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం మంచిది.
తెలంగాణా ప్రభుత్వం హైకోర్టు విభజన చేయాలని కోరుతోంది. ఉభయ రాష్ట్రాలకి సంబంధించిన ఈ సమస్యని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెండేళ్ళు సాగదీసి చాలా జటిలం చేసింది. కనుక ఇప్పటికైనా దీనిపై నిర్ణయం తీసుకొంటే మంచిది. నిన్ననే ఢిల్లీ చేరుకొన్న తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమావేశం ముగిసిన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ చొరవ తీసుకొని ఇరువురు ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించినట్లయితే ఈ సమస్య చాలా సులువుగా పరిష్కరించవచ్చు. హైకోర్టు విభజనకి సహకరించాలని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా కోరితే చంద్రబాబు నాయుడు తిరస్కరించలేరు కూడా. కనుక ప్రధాని ఇప్పుడైనా హైకోర్టు విభజన విషయంలో చొరవ తీసుకొంటే బాగుంటుంది.