
సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మిషన్ భగీరధ పధకం ద్వారా ఇంతవరకు అనేక గ్రామాలలో నీళ్ళు రానేలేదు. అనేకచోట్ల పనులే పూర్తిలేదు. అయినా జగిత్యాల పట్టణానికి గత ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఈ పధకం ద్వారా నీళ్ళు సరఫరా చేసినందుకు రూ.2.50 కోట్లు చెల్లించాలని ఆ ప్రాజెక్టు ఈఈ నోటీసులు జారీ చేశారు. ప్రజలకు ఉచితంగా శుద్దమైన త్రాగునీటిని అందిస్తామని చెపుతున్న ప్రభుత్వం ఏడాదికి రూ.5 కోట్లు చొప్పున మళ్ళీ ప్రజల వద్ద నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తుందా? ఆ డబ్బు ఎవరు చెల్లిస్తారు? 14వ ఆర్ధిక సంఘం కింద పంచాయితీలకు మంజూరైన కొద్దిపాటి నిధులలో ఇప్పటికే విద్యుత్ వాడకానికి చెల్లింపులు పేరిట ప్రభుత్వం కోత విధించింది. మిగిలిన కొద్దిపాటి సొమ్ములో మళ్ళీ కొంత మిషన్ భగీరధ నిర్వహణకు కేటాయించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదెక్కడి అన్యాయం? ఈ లెక్కన ఇక గ్రామపంచాయతీలలో అభివృద్ధి ఏవిధంగా జరుగుతుంది?” అని ప్రశ్నించారు.