
మూడు దశలలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో నేడు తుదిదశకు పోలింగ్ మొదలైంది. ఈరోజు 4,116 పంచాయతీలకు ఎన్నికలు జరుగవలసి ఉండగా వాటిలో 577 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మంగంపేట మండలంలోని 25 గ్రామాలలో ఎన్నికలు నిలిపివేయవలసిందిగా హైకోర్టు బుదవారం ఆదేశించింది. మరో 10 గ్రామాలలో నామినేషన్లు దాఖలవలేదు. కనుక మిగిలిన 3,504 గ్రామాలలో నేడు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వాటిలో సర్పంచ్ పదవికి 11,667 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. నేడు పోలింగ్ జరుగుతున్న గ్రామాలలో 36,729 వార్డులలో 8,959 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మరో 188 వార్డులకు నామినేషన్లు దాఖలవలేదు. మిగిలిన 27,582 వార్డులకు 73,976 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.
రెండవ విడతలో పోలింగ్ వాయిదా పడిన మూడు గ్రామాలలో నేడు పోలింగ్ నిర్వహిస్తారు.
ఈరోజు ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం రిటర్నింగ్ అధికారి సమక్షంలో ప్రత్యక్షపద్దతిలో ఉపసర్పంచ్ ను ఎన్నిక జరుగుతుంది.
పోలింగ్ జరుగుతున్న గ్రామాలలో నివసిస్తున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నేడు వేతనంతో కూడిన శలవు దినంగా ప్రకటించింది. ఈమేరకు తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రైవేట్ సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు కూడా సెలవు ఇవ్వాలని ఆదేశించారు.
మొదటి రెండు విడతలలో కలిపి తెరాస-4,466, కాంగ్రెస్-1,395, బిజెపి-84, టిడిపి-51, సిపిఐ-22, సిపిఎం-45, ఇతరులు-1,121 పంచాయతీలలో విజయం సాధించాయి.