గురువుని మించిన శిష్యుడు కెసిఆర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది వరకు పదేపదే ఒక మాట చెప్పేవారు. “ప్రభుత్వాలుగా సహాకరించుకొందాము. పార్టీలని వాటి పని అవి చేసుకోనిద్దాము” అని కెసిఆర్ కి ఆయన సూచిస్తుండేవారు. ఆంధ్రాలో తెరాస పార్టీ లేదు కనుక ఆయన అటువంటి సూచన చేయగలిగారు. అదే తెరాస ఉండి ఉంటే అటువంటి ఆలోచన చేసి ఉండేవారు కాదేమో? అయన ఉద్దేశ్యం ఏమిటంటే తెలంగాణా ప్రభుత్వంఫై తెదేపా విమర్శలు చేస్తూనే ఉంటుంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో యుద్ధం చేస్తూనే ఉంటుంది. కానీ తెరాస ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరించాలని చెప్పిన్నట్లుంది.

మొదట్లో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అయన సూచనలని పట్టించుకోకపోయినా ఆ తరువాత ఆ పద్ధతిలోనే తెదేపాతో వ్యవహరించి గట్టిగా బుద్ధి చెప్పారు. తెదేపా ఎమ్మెల్యేలని, పార్టీ కార్యకర్తలని తెరాసలోకి ఆకర్షించి తెలంగాణాలో తెదేపాని దాదాపుగా తుడిచిపెట్టేశారు. పార్టీల వ్యవహారాలలో, వాటి పోరాటాలలో కలుగజేసుకోవద్దని స్వయంగా చంద్రబాబు నాయుడే సలహా ఇచ్చారు కనుక, ఫిరాయింపుల వలన తెలంగాణాలో తెదేపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతోందని తెలిసినా, దాని గురించి చంద్రబాబు నాయుడు ఏమీ మాట్లాడలేకపోయారు. ఆయన చెప్పిన సలహాతో తెదేపాని కెసిఆర్ దెబ్బ తీశారు, కానీ ఆయన చెప్పిన రెండో సలహా..అదే ప్రభుత్వాలు సహకరించుకోవడం గురించి మాత్రం పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. నేటికీ రెండు ప్రభుత్వాల మధ్య ఏదో కారణంతో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఏమైనప్పటికీ తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ గురువుని మించిన శిష్యుడు అని పదేపదే నిరూపించుకొంటూనే ఉన్నారు.