
తెలంగాణ శాసనసభ్యులు, మండలి సభ్యుల కోసం హైదర్ గూడాలో 12 అంతస్తులలో 120 క్వార్టర్లను ప్రభుత్వం నిర్మించింది. మొత్తం నాలుగున్నర ఎకరాలలో రూ.166 కోట్లు వ్యయంతో వాటిని నిర్మించినట్లు అధికారులు తెలిపారు. 2,100 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించబడిన ఒక్కో ఫ్లాటులో 3 బెడ్ రూములు, పెద్ద హాలు, వంటగది వగైరాలన్నీ ఉంటాయి. అలాగే అత్యాధునిక సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు కలిగి ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో బ్యాంకు, సూపర్ మార్కెట్, క్లబ్ హౌస్ మొదలైనవన్నీ ఏర్పాటు చేశారు.
ప్రజాప్రతినిధులు, వారిని సందర్శిచేవారి వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి సౌకర్యం మూడంతస్థులతో సెల్లార్ నిర్మించబడింది. దానిలో 240 వాహనాలు పార్కింగ్ చేయవచ్చు. ప్రజాప్రతినిధులు సమావేశాలు నిర్వహించుకోవడానికి వీలుగా 23 సువిశాలమైన సమావేశ మందిరాలు కూడా ఉన్నాయి. వారి వ్యక్తిగత, సెక్యూరిటీ సిబ్బంది, అసెంబ్లీ సిబ్బంది కోసం 36 గదులు వేరేగా కేటాయించబడ్డాయి.
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఈ భవన సముదాయాలను పరిశీలించారు. మొత్తం 120 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలకు ఈ భవనాలలో ఇళ్ళు కేటాయిస్తామని, అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్, మంత్రులు, చీఫ్ విప్‌లు, విప్‌లకు వేరేగా భవనాలు కేటాయిస్తామని తెలిపారు. త్వరలోనే సిఎం కేసీఆర్ ఈ నూతన భవనసముదాయ్యని ప్రారంభోత్సవం చేస్తారని అనంతరం ప్రజాప్రతినిధులకు కొత్త ఇళ్ళు అందజేస్తామని పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.