వారం రోజులలో పాస్‌పోర్టు

హన్మకొండ హెడ్‌పోస్టాఫీస్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు సేవాకేంద్రం వలన ఉమ్మడి వరంగల్ జిల్లావాసులకు చాలా సౌకర్యంగా ఉంది. గతంలో పాస్‌పోర్టు కావాలంటే హైదరాబాద్‌ వెళ్ళి వారం పది రోజులు తిరుగవలసి వచ్చేది. కానీ ఇప్పుడు హన్మకొండ కార్యాలయంలోనే దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉండటమే కాక దరఖాస్తు చేసిన వారం-పది రోజులలో పాస్‌పోర్టు ఇంటికే పోస్టులో వచ్చేస్తుండటంతో జిల్లాలో పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకొంటున్నవారు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

2017, మార్చి 29న పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు సేవాకేంద్రం ఏర్పాటు చేసినప్పటి నుంచి సగటున రోజుకు 90 మంది దరఖాస్తు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకొంటున్నారంటే ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. పాస్‌పోర్టు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ చేస్తున్న కారణంగా వారం-పది రోజుల లోపే దరఖాస్తుదారుల  చేతికి పాస్‌పోర్టులు వస్తున్నాయి. 

ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలంటే: ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవలసి ఉంటుంది. పెద్దలకు రూ.1500, మైనర్లకు రూ.1,000 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. దరఖాస్తుతో పాటు గుర్తింపు పత్రాలను (ఆధార్, లేదా రేషన్ కార్డు లేదా ఓటరు ఐడి) సమర్పించవలసి ఉంటుంది. వాటిని హన్మకొండ పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు సేవాకేంద్రంలోనే క్షుణ్ణంగా పరిశీలిస్తారు కనుక హైదరాబాద్‌లో ప్రాసెసింగ్ కు ఎక్కువ సమయం పట్టదు. పాస్‌పోర్టు కార్యాలయం నుంచి స్థానిక స్పెషల్ బ్రాంచ్ పోలీస్ శాఖకు దరఖాస్తుదారుడి సమాచారం మెసేజ్ ద్వారా పంపించబడుతుంది. వెంటనే పోలీసులు కూడా వచ్చి దరఖాస్తుదారుడి వివరాలు దృవీకరించుకొని తెలియజేయగానే, హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం దరఖాస్తుదారుడికి పాస్‌పోర్టును పోస్టులో పంపిస్తుంది. ఇదంతా వారం పది రోజులలో జరుగుతుండటం జిల్లాలో పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకొంటున్నవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.