హైదరాబాద్ లో వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణంపై సిమెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోషియేషన్ తో మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు సమావేశం అయ్యారు. నగరంలో వైట్ టాపింగ్ రోడ్లు నిర్మించే ముందు జీహెచ్ఎంసీ తీసుకోవాల్సిన చర్యల మీద వారితో చర్చించారు. రోడ్లతో పాటు కేబులింగ్ కోసం డక్ట్ ఏర్పాటు, సీవరేజీ లైన్ల విషయంలో జీహెచ్ఎంసీ రూపొందించాల్సిన ప్రణాళికల మీద వారితో చర్చించారు. వైట్ టాపింగ్ రోడ్లతో ఉన్న టెక్నాలజీలు, నగరానికి సరిపోయే టెక్నాలజీల పైన వివరాలు తెలుసుకున్నారు. వైట్ టాపింగ్ రోడ్ల అంశంపైన ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు త్వరలోనే ఒక సమావేశం నిర్వహించనున్నారని మంత్రి కేటీఆర్ వారికి తెలిపారు. సమావేశం నాటికి వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణ వ్యయం తగ్గించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని మంత్రి కోరారు.
సిమెంటు రోడ్ల నిర్మాణానికి వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని, ఆయా శాఖల అవసరాలను ముందే తెలుసుకుని ప్రణాళికలను తయారు చేయాలని మంత్రి కేటీఆర్ ను కంపెనీల ప్రతినిధులు కోరారు. స్థానికంగా సిమెంటు మిక్సింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు తాత్కాలికంగా నగరంలోనే పలు ప్రాంతాలను ఇస్తే రవాణ, నిర్మాణం సులభం అవుతుందన్నారు. వైట్ టాపింగ్ రోడ్ల పనుల కోసం ప్రత్యేకంగా ఇంజనీరింగ్ సిబ్బందితో కూడిన ఒక యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని సిమెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోషియేషన్ తెలిపింది. రోడ్ల నిర్మాణానికి అవసరమైన యంత్రాల కోనుగోలు అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తే, రోడ్డు నిర్మాణ వ్యయం తగ్గుతుందన్నారు.
హైదరాబాద్ రోడ్లు వేగంగా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు నిర్మాణ సమయం తగ్గేందుకు ఉన్న అవకాశాలను తెలియజేయాలని కంపెనీ ప్రతినిధులను మంత్రి కేటీఆర్ కోరారు. వివిధ నగరాల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా చేపట్టిన వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణ పనుల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. సిమెంట్ రోడ్లను నిర్మించిన తర్వాత కనీసం 15 సంవత్సరాలపాటు నిర్వహణ(డిపెక్ట్ లయబులిటీ) ఉండాలన్నది ప్రభుత్వ ఆలోచన అన్నారు. అవసరమైతే నిర్మాణం చేసే కంపెనీలకే రోడ్ల డిజైన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.