
కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకం బావిస్తున్న 124వ రాజ్యాంగ సవరణ బిల్లు (ఈబీసీ బిల్లు) (అగ్రవర్ణాల పేదలకు విద్యాఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు కల్పించే బిల్లు)ను నిన్న రాజ్యసభ కూడా ఆమోదించింది. నిన్న ఉదయం నుంచి రాత్రి 10.20 గంటల వరకు సభలో దీనిపై అర్ధవంతమైన చర్చలు, అధికార, ప్రతిపక్షాల మద్య తీవ్ర వాదోపవాదాలు జరిగిన తరువాత బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా 165-7 ఓట్లు తేడాతో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై సభలో జరిగిన చర్చలో తెరాస, టిడిపి, కాంగ్రెస్ పార్టీలతో దాదాపు అన్ని పార్టీలు పాల్గొని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ అనుకూలంగా ఓటు వేశాయి. అన్నాడిఎంకె, డిఎంకె, ఆర్జేడీ, ఐయూఎంల్ పార్టీలు మాత్రమే ఈ బిల్లును వ్యతిరేకించాయి.
పార్లమెంటు ఆమోదించిన ఈ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించడం లాంఛనప్రాయమే కనుక అతి త్వరలోనే ఈ బిల్లు చట్టరూపం పొందనుంది. దీంతో దేశంలో రిజర్వేషన్లు 59.5 శాతంకు చేరుతాయి.
దీనిని అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన పార్లమెంటు ఆమోదించింది కనుక దీని కోసం మళ్ళీ వేరేగా రాష్ట్రాల అనుమతి, అభిప్రాయం తీసుకోనవసరం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తున్న 49.5 శాతం రిజర్వేషన్లను ముట్టుకోకుండా మిగిలిన 50.5 శాతంలో అన్ని వర్గాలకు ఆర్ధిక ప్రాతిపదికన 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తునందున దీనికి సుప్రీంకోర్టు అభ్యంతరం చెప్పబోదని తాము భావిస్తున్నట్లు చెప్పారు.