
ఈనెల 19న కోల్‌కతాలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ర్యాలీ జరుగబోతోంది. ఆ పార్టీని కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటు కాబోతున్న కూటమిలోకి ఆకర్షించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా పలువురు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా కోల్‌కతాలో జరిగే ర్యాలీలో పాల్గొనడానికి రాహుల్ గాంధీ సిద్దంగా ఉన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలో బిజెపికి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్న ఏపీ సిఎం చంద్రబాబునాయుడు బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీల అధినేతలను కూడా ఆ ర్యాలీలో పాల్గొనేందుకు ఒప్పిస్తున్నారు.
ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన మంగళవారం సాయంత్రం డిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీతో, ఆ తరువాత డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాతో వరుసగా సమావేశమయ్యి కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి ఏర్పాటు గురించి చర్చించారు.
అనంతరం ఆయన డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “కోల్‌కతా ర్యాలీకి ఎవరెవరు హాజరుకాబోతున్నారో ఒకటి రెండు రోజులలో తెలుస్తుంది. అందరూ వచ్చినట్లయితే కోల్‌కతాలోనే కూటమి ఏర్పాటు గురించి చర్చించుకుంటాము లేకుంటే మరోసారి డిల్లీలోనే చర్చించుకుంటాము. కోల్‌కతాలో జరిగే ర్యాలీలో పాల్గొనవలసిందిగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అన్ని లౌకికవాద పార్టీలకు ఆహ్వానాలు పంపుతోంది. కనుక కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం పార్టీకి ఆహ్వానం పంపకపోవడమనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. మతతత్వ శక్తుల నుంచి దేశాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉంది. కనుక లౌకికవాద పార్టీలన్నీ ఏకం కావలసిన అవసరం చాలా ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలో అన్ని పార్టీలు కలిసిపనిచేయడానికి నేను చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయనే పూర్తి నమ్మకంతో ఉన్నాను,” అని చెప్పారు.
తృణమూల్ ర్యాలీలో ఇతర పార్టీలు పాల్గొనడానికి సిద్దపడినా ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ నేతృత్వంలో పని చేయడానికి అంగీకరిస్తారా లేదో అనుమానమే. ఎందుకంటే ఆమె ప్రధానమంత్రి పదవిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే తన పార్టీ ద్వారా ఆ విషయం అధికారికంగా ప్రకటింపజేశారు కూడా. కనుక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవిని ఆమె కోసం త్యాగం చేయడానికి సిద్దపడితేనే ఆమె కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేయడానికి ఇష్టపడవచ్చు లేకుంటే కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫ్రంట్ వైపు మొగ్గు చూపవచ్చు. కనుక ఆమెను ప్రసన్నం చేసుకోవాలంటే రాహుల్ గాంధీ త్యాగానికి సిద్దపడవలసి ఉంటుంది. మరి ఆయన అందుకు సిద్దపడతారా? చూడాలి.